న్యాయమూర్తికే అన్యాయమా ?

9 Jul, 2018 08:20 IST|Sakshi

అనర్హత వేటుపై తీర్పు చెప్పడమే నేరమా ?

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తికి హత్యాబెదిరింపులు

ఇంటి వద్ద సాయుధ బందోబస్తు

అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు హద్దులు దాటాయి. సాక్షాత్తున్యాయమూర్తి కుటుంబాన్నే హతమారుస్తామని బెదిరించే స్థాయికి తెగించాయి.గౌరవప్రదమైన బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తినే భయభ్రాంతులకు గురిచేశాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన తరువాత దినకరన్, ఎడపాడి, పన్నీర్‌సెల్వం  రూపంలో పార్టీ మూడు చెక్కలైంది. ఎడపాడి, పన్నీర్‌ యుగళగీతం ఆలపించి ఏకంకాగా రెండు వర్గాలుగా మిగిలిపోయింది. శశికళ దయాదాక్షిణ్యాలతో సీఎం పదవిని చేపట్టిన ఎడపాడి, శశికళపై తిరుగుబాటు చేసి పన్నీర్‌సెల్వం ఏకమైన తనను ఒంటరివాడిని చే యడమేగాక పార్టీ నుంచి బహిష్కరించడాన్ని దినకరన్‌ జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వాన్ని కూలదోయడం ద్వారా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దినకరన్‌ తనకు మద్దతిచ్చే 19 మంది ఎమ్మెల్యేల చేత ప్రభుత్వానికి ఉపసంహరించుకున్నట్లుగా గవర్నర్‌కు ఉత్తరం ఇప్పించారు. అయితే ఇంతలో వీరిలో ఒక ఎమ్మెల్యే ఎడపాడి వైపునకు మొ గ్గారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని కూ లదోసే కుట్ర పన్నారనే ఆరోపణలపై మిగతా 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ధనపాల్‌ అనర్హతవేటు వేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని 18 మంది ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ ఫుల్‌ బెంచ్‌కు విచారణకు రాగా ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి వేటు చెల్లుతుందని తీర్పు చెప్పగా, స్పీకర్‌ తీసుకున్న వేటు నిర్ణయం చెల్లదని న్యాయమూర్తి సుందర్‌ తీర్పు వెల్లడించారు. దీంతో అనర్హత వేటు అంశం మూడో న్యాయమూర్తి ముంగిటకు వెళ్లింది.

న్యాయమూర్తికి బెదిరింపులు
ఈ నేపథ్యంలో అనర్హతవేటు పడిన 18 అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్‌కు ఒక ఆకాశరామన్న ఉత్తరం అందింది. చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల క్వార్టర్స్‌ సమీపంలో సుందర్‌ తన భార్య, కుమార్తెతో నివసిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆదివారంఅందిన ఉత్తరంలో ‘18 మంది ఎమ్మెల్యేల కేసులో స్పీకర్‌ ఉత్తర్వులు చెల్లవని తీర్పు చెప్పిన నిన్ను, నీ కుటుంబ సభ్యులను హతమారుస్తాం’ అని  పేర్కొని ఉంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి దృష్టికి తీసుకెళ్లగా ఆమె పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుని గాలింపు చర్యలు ప్రారంభించారు. న్యాయమూర్తి సుందర్‌ ఇంటికి 24 గంటలపాటు బందోబస్తుకు సాయుధ పోలీసులను నియమించారు. న్యాయమూర్తి రాకపోకలు సాగించే దారుల్లోనూ బందోబస్తు పెట్టారు. 

మరిన్ని వార్తలు