‘దీప’కు బెదిరింపులు..!

6 Aug, 2019 08:08 IST|Sakshi
దీప

కమిషనర్‌కు ఫిర్యాదు

భద్రత కల్పించాలని విజ్ఞప్తి

సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపకు బెదిరింపులు, వేధింపులు పెరిగాయి. ఎంజీఆర్, అమ్మ, దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ బెదిరింపులు, వేదింపులు పెరిగాయి. దీంతో తనకు, తన భర్తకు భద్రత కల్పించాలని కమిషనర్‌ విశ్వనాథన్‌కు దీప విజ్ఞప్తి చేశారు.జయలలిత మరణం అనంతరం ఆమె మేన కోడలు దీప ఓ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవైతో రెండేళ్ల పాటుగా సాగిన ఈ పార్టీ వ్యవహారాల మీద అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. పదవుల్ని అమ్ముకున్నట్టుగా కూడా ఆరోపణలే కాదు, వ్యవహారం ముదిరి పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీని నడప లేని పరిస్థితుల్లో ఉన్న దీప, ఇక రాజకీయాలకు దూరం అని గత వారం ప్రకటించారు. అలాగే, ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ పార్టీ కోసం జేబులు చిల్లు చేసుకున్న వాళ్లలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమతో మాట వరసకైనా చెప్పకుండా, ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. జయలలిత మీదున్న అభిమానంతో దీప వెన్నంటి నిలబడి ఆస్తుల్ని సైతం అమ్ముకున్నామని చాలా మంది వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దీపకు ఆ శక్తుల నుంచి బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరిగినట్టుంది.

ఆడియో ద్వారా ఫిర్యాదు
సోమవారం కమిషనర్‌ విశ్వనాథన్‌కు దీప ఆడియో రూపంలో ఫిర్యాదు చేశారు. తాను జయలలిత మేన కోడలుగా పేర్కొంటూ, ఇది వరకు తాను రాజకీయాల్లో ఉన్నానని,ప్రస్తుతం తప్పుకున్నట్టు గుర్తు చేశారు. రాజకీయ జీవితం నుంచి దూరంగా ఉన్న తనకు ప్రస్తుతం బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన పార్టీ పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేసిన అనంతరం ఈ బెదిరింపులు పెరిగినట్టు వివరించారు. ఫోన్ల ద్వారా, వాయిస్‌ మెస్సేజ్‌ల ద్వారా వస్తున్న బెదిరింపులు ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఓ మహిళ అనే విషయాన్ని కూడా పరిగణించకుండా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అనారోగ్య సమస్య ఉందని, కొంత కాలం చికిత్స సైతం తీసుకోవాల్సి ఉందని, ఈ సమయంలో ఈ బెదిరింపులు భయాన్ని కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణ హాని సైతం ఉందని, దయ చేసి తనకు తన భర్త మాధవన్‌కు భద్రత కల్పించాలని కోరారు. అన్నాడీఎంకేలో పేరవైను విలీనం చేయడానికి అంగీకరించని శక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాయని, తనకు భద్రత కల్పించాలని విన్నవించారు.

మరిన్ని వార్తలు