న్యూఢిల్లీ నచ్చింది

26 Jul, 2014 22:31 IST|Sakshi

 దేశ రాజధానిలో తమ వారిపై దాడులు జరుగుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నా, ఈశాన్యప్రాంతవాసులు ఇక్కడికి రావడం మానడం లేదు. విద్య, ఉద్యోగ  అవకాశాలు, ఆదాయం అధికంగా ఉండడమే ఈ పరిస్థితికి కారణం. ఉన్నత విద్యావంతులు కావడం, అందంగా కనిపించడం, ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కష్టపడే మనస్తత్వం కారణంగా ఈశాన్యవాసులను కీలక ఉద్యోగాలు వరిస్తున్నాయి.
 
 న్యూఢిల్లీ: జాతి వివక్ష అధికంగా ఉన్నా, తమకు అన్నం పెడుతున్నఢిల్లీని వదిలిపెట్టేందుకు ఇక్కడి ఈశాన్యరాష్ట్రాల వాసులు సిద్ధంగా లేరు. ఈశాన్య రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ కాబట్టి అక్కడి యువతలో చాలా మంది దేశరాజధానిని ఆశ్రయించకతప్పడం లేదు. గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చి ఉద్యోగం చేసే అభిజిత్ బారువా అనే యువకుడు మాట్లాడుతూ ‘మంచి అవకాశాలు దొరికితే వేరే నగరానికి ఉపాధి కోసం వెళ్లేందుకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఉద్యోగాల సంఖ్య ఎక్కువ. అందుకే వేరే ప్రాంతానికి వెళ్లాలన్న ఆలోచన ఇప్పటికీ కలగలేదు’అనిఆయన వివరించారు. అసోంలోని తీన్‌సుకియా నుంచి వచ్చిన సాగరికా దత్తా కూడా ఇలాగే మాట్లాడింది. ఇది తన కలల నగరమని చెప్పింది. 12వ తరగతి తరువాత గ్రాడ్యుయేషన్ కోర్సులకు తగిన ఈశాన్య రాష్ట్రాల్లో విద్యాసంస్థలు లేకపోవడంతో అక్కడి విద్యార్థులు టీనేజ్‌లోనే ఢిల్లీకి వస్తున్నారు. తమ బంధువులు కూడా ఇక్కడే చదువుతుండడంతో తాను కూడా ఢిల్లీకే వచ్చానని దత్తా వివరించింది.
 
 ఢిల్లీలో నివసించే ప్రతి వంద మంది ఈశాన్యవాసుల్లో 78 శాతం మంది ఏదోరకమైన జాతివివక్షను ఎదుర్కొన్న వాళ్లేనని ఈశాన్య సహాయం కేంద్రం, హెల్ప్‌లైన్ (ఎన్‌ఈఎస్‌సీహెచ్) అధ్యయనం తేల్చింది. ఈశాన్య మహిళలు తరచూ లైంగిక వేధింపుల బారినపడుతున్నారని ఇది ప్రకటించింది. జాతిని హేళన చేస్తూ వ్యాఖ్యలు, ధూషించడం, దాడి చేయడం తరచూ జరుగుతున్నాయని తెలిపింది. తాజాగా కోట్లా ప్రాంతంలో మణిపూర్ యువకుణ్ని దాడి చేసి హతమార్చిన ఘటన ఇక్కడి ఈశాన్యవాసుల్లో భయాన్ని మరింత పెంచింది. ఢిల్లీలో తమకు తరచూ చేదు అనుభవాలు ఎదురవుతున్నా, విద్య, ఉద్యోగాల పరంగా తాము ఎంతగానో అభివృద్ధి చెందుతున్నామన్న సంతోషం వీరిలో కనిపిస్తోంది. తాను ఇప్పటి వరకు జాతివివక్షను ఎదుర్కోలేదని దత్తా చెప్పింది.
 
 ‘మనకు ఉన్న స్నేహితులు, నివసించే ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి. నేను ఎప్పుడూ నా పురోగతి గురించి ఆలోచిస్తాను. ఈశాన్య రాష్ట్రాల్లో అఅవకాశాలు తక్కువ కాబట్టి ఏదో ఒక ఇతర నగరంలో స్థిరపడకతప్పదు’ అని వివరించింది. ఢిల్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం వల్ల యువతను సులువుగా ఆకర్షించగలుగుతోందని బోరా అన్నాడు. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిమ్ రాష్ట్రాల యువత మొదట్లో బీపీఓ ఉద్యోగాల్లో బాగా కనిపించేవారు. ఇప్పుడు వీళ్లు మీడియా, ఆతిథ్యరంగం, వాణిజ్య ప్రకటనల కంపెనీల్లోనూ మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఉన్నత విద్యావంతులు కావడం, ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కష్టపడే మనస్తత్వం కారణంగా ఈశాన్యవాసులను ఉద్యోగాలు వరిస్తున్నాయి.
 
 ఈ ఎనిమిది రాష్ట్రాలకు చెందిన దాదాపు రెండు లక్షల మంది యువత ఢిల్లీలో పనిచేస్తున్నట్టు అంచనా. వీరిలో దాదాపు సగం మంది మహిళలు. నాగలాండ్ మహిళ కసర్ మాట్లాడుతూ ‘మా కుటుంబం ఇక్కడే స్థిరపడడంతో ఢిల్లీలో చదవడం సులువయింది. మా కుటుంబం ఇక్కడ లేకపోయినా నేను ఢిల్లీకే వచ్చేదాణ్ని. ఇక్కడ అవకాశాలు చాలా ఎక్కువ. తమ న్యాయవాదులుగా ఈశాన్యవాసులను  నియమించుకోవడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి’ అని వివరించింది. ఢిల్లీలో తమ వారిపై దాడులు జరుగుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నా, ఈశాన్యప్రాంతవాసులు ఇక్కడికి రావడం మానడం లేదు.
 

మరిన్ని వార్తలు