అప్పుతో ఆపరేషన్లు..!

22 Nov, 2016 03:29 IST|Sakshi
 రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో రోగులు పడుతున్న  ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పుతో శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి బళ్లారిలోని అరుణోదయ ఆస్పత్రి ముందుకు వచ్చింది. అప్పుతో శస్త్ర చికిత్సలు, మోకాలి చిప్పలను మార్పిడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అరుణోదయ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కందుల పేర్కొన్నారు. సోమవారం ఆయన నగరంలోని రాయల్ ఫోర్ట్‌లో విలేకరులతో మాట్లాడారు.
 
  పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల అత్యవసరంగా చికిత్సలు చేయించుకునేందుకు పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ పరిధిలో చేసే ఆర్థోపెడిక్ సంబంధిత శస్త్రచికిత్సలు మూడు నెలల పాటు రోగులకు అప్పుగా చేస్తున్నట్లు చెప్పారు. రోగికి అత్యవసరంగా మోకాలి చిప్పల మార్పిడి లేదా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలను కూడా అప్పుతో చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం రోగులు ఆధార్ కార్డు  అందజేస్తే చాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా అప్పుగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు.  
  - సాక్షి, బళ్లారి 
 
మరిన్ని వార్తలు