శ్రీవారి సేవకు మరో ఇద్దరు

29 Oct, 2016 12:00 IST|Sakshi
శ్రీవారి సేవకు మరో ఇద్దరు
టీటీడీ స్థానిక సలహా మండలిలో నియామకాలు
ఎస్‌ శంకర్, డి. రాధాకృష్ణమూర్తికి స్థానం
వారం రోజుల్లో మరికొన్ని పేర్లు
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ, చెన్నై) స్థానిక సలహా మండలి సభ్యుల ని యామకాలు ఎట్టకేలకూ ప్రారంభమయ్యాయి. సలహా మండలి సభ్యుల హోదాలో శ్రీవారికి సేవ చేసేందుకు మరో ఇద్దరికి అవకాశం లభించింది. చెన్నైకి చెందిన తెలుగు ప్రముఖులైన ఎస్‌ శంకర్, దుగ్గి రాధాకృష్ణమూర్తిలను మండలి సభ్యులుగా నియమిస్తూ దేవస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
 
చెన్నై టీనగర్‌ వెంకటనారాయణ్‌ రోడ్డులో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సమాచార కేంద్రం స్థానిక సలహా మండలి వారు భక్తి ప్రపత్తులతో నిర్వహించే కార్యక్రమాల వల్ల క్రమేణా ఆలయంగా ప్రసిద్ది చెందింది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో జరిగే అన్నిరకాల ప్రత్యేక సేవలు చెన్నైలోని ఆలయంలో ప్రవేశపెట్టారు. ఇది కేవలం సమాచార కేంద్రం అనే సంగతిని ప్రజలు ఏనాడో మరిచిపోయారు. ఇక్కడి శ్రీవారి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అధ్యక్షులు, 16 మంది సభ్యులతో కూడిన సలహా మండలిని రెండేళ్లకు ఒకసారి నియమించడం ఘానవాయితీగా వస్తోంది. బ్రహ్మయ్య అండ్‌కో భాగస్వామి, ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ శ్రీకృష్ణను సలహా మండలి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుమారు ఆరునెలల క్రితం నియమించింది.
 
16 స్థానాలకు సుమారు 780 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మండలిలో చోటు కోసం ఎవరి పలుకుబడిని వారు ప్రయోగించడంతో రాజకీయ వత్తిడిని భరించలేక సభ్యుల ప్రస్తావన లేకుండా అధ్యక్షుని నియామకంతో ప్రభుత్వం మిన్నకుండిపోయింది. అయితే పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకో లేదా రాజకీయ పెద్దల వత్తిడి తలొగ్గడమో కారణం ఏదైనా ఎట్టకేలకూ సభ్యుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా నియమితులైన శంకర్‌ భారతీయ జనతా పార్టీ కోటా కింద, దుగ్గి రాధాకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ కోటా కింద నియమితులైనారు. సలహా మండలిలో సభత్వం ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంకా కొంతమందిని సంతృప్తిపరచాల్సి ఉండగా, వారం రోజుల్లోగా మరికొంత మంది పేర్లు సలహా మండలి జాబితాలో చల్లగా సర్దుకుపోనున్నాయి.    
మరిన్ని వార్తలు