స్థానికం వేగవంతం

10 Mar, 2017 02:51 IST|Sakshi

► రంగంలోకి ఎన్నికల అధికారులు
► 31 జిల్లాలకు నియామకం
►  త్వరలో మోగనున్న నగారా


స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. రంగంలోకి ఎన్నికల అధికారులు దిగారు. 31 జిల్లాలకు ఎన్నికల అధికారుల్ని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి సీతారామన్ ఆదేశాల మేరకు కార్యదర్శి రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, వేలూరు, తిరునల్వేలి, దిండుగల్, తంజావూరులతో పాటు పన్నెండు కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీలు, 529 పట్టణ పంచాయతీలు, 12 వేల గ్రామ పంచాయతీలు  జిల్లా పరిషత్‌, జిల్లాకు ఐదారు చొప్పున యూనియన్  పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని లక్షా 30 వేలకు పైగా స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీ కాలం గత ఏడాదితో ముగిసింది. ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకున్న గందరగోళం, రిజర్వేషన్ల వర్తింపు వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగానే స్పందించడంతో ఓ సారి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు అయింది. ప్రస్తుతం మే పదిహేనులోపు ఎన్నికల్ని పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగమేఘాలపై ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల అధికారులు చేస్తున్నారు.

చెన్నై కోయంబేడులోని రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల అధికారి సీతారామన్ ఇందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఈ పరిస్థితుల్లో జిల్లాల వారీగా ఎన్నికల అధికారుల్ని ప్రత్యేకంగా రంగంలోకి దించుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికల కసరత్తులు  ఇప్పటికే సాగాయి. అయితే, ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి కసరత్తులకు సీతారామన్  ఆదేశాలు జారీ చేశారు. చెన్నై మినహా తక్కిన 31 జిల్లాలకు ఎన్నికల అధికారుల్ని రంగంలోకి దించారు. ఈ అధికారులు తుది ఓటర్ల జాబితా, గ్రామ, పట్టణ, యూనియన్, జిల్లా పరిషత్‌ కౌన్సిలర్లు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు తగ్గ జాబితాల రూపకల్పన, తదితర పనులపై దృష్టి కేంద్రీకరించనుంది.

ఆయా జిల్లాలకు నియమించిన ఎన్నికల అధికారుల వివరాలను సీతారామన్ ఆదేశాల మేరకు ఆయన కార్యదర్శి రాజశేఖర్‌ విడుదల చేయడంతో, పనుల వేగం మరింతగా పెంచే పనిలో జిల్లాల్లోని అధికారులు నిమగ్నమయ్యారు. వారంలోపు అన్ని పనుల్ని పూర్తి చేసి ఆయా జిల్లాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి నివేదిక సమర్పించేందుకు తగ్గ కార్యాచరణతో ప్రత్యేక ఎన్నికల అధికారులు రంగంలోకి దిగడంతో, మరి కొద్ది రోజుల్లో స్థానిక నగారా మోగే అవకాశాలు ఉన్నట్టు ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు