అమ్మ సేనల్లో ఆనందం

24 Oct, 2016 01:06 IST|Sakshi

సాక్షి, చెన్నై: అనారోగ్యంతో అమ్మ జయలలిత ఆసుపత్రిలో చేరి నెల రోజులు దాటింది. ఆమెకు అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల్ని అందిస్తూ వస్తున్నారు. పలు రకాల వదంతులు, ప్రచారాలు సాగినా, వాటన్నింటికి అమ్మ ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతూ , ప్రస్తుతం దాదాపు కోలుకున్నట్టే అని వస్తున్న సమాచారాలే సమాధానం.
 
 అపోలో ఆసుపత్రికి మళ్లీ లండన్ వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్యుడు గిల్నాని ఆదివారం రావడంతో ఇక, తమ అమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డట్టే అన్న ఆనందం అన్నాడీఎంకే వర్గాల్లో బయలు దేరింది. జయలలిత సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో పూజలు హోరెత్తించారు. పాల కలశాలతో అనేక చోట్ల ఊరేగింపులు ఆలయాల వైపుగా సాగాయి. మరికొన్ని చోట్ల నిప్పు కుండల్ని చేత బట్టి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
 
  ఇక, సంపూర్ణ ఆరోగ్య వంతురాలుగా తమ ముందుకు అమ్మ రానున్నారన్న సమాచారంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఉదయం సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి కేరళ మాజీ సీఎం ఉమన్ చాంది అపోలో ఆసుపత్రికి చేరుకుని విచారించారు. జయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ప్రజల ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం విశేషం. ఇక, సింగపూర్ నుంచి వచ్చిన అక్కడి ప్రభుత్వం ప్రతినిధి జోష్వా జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వర్గాల వద్ద, మంత్రుల వద్ద విచారించారు.
 
  జయలలిత త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్య వంతురాలు కావాలని కాంక్షిస్తున్నట్టు జోష్వా పేర్కొన్నారు. ఇక, సీనియర్ నటి లత కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు. సేలం సమీపంలోని కామాక్షి దేవి పెరియ నాయకీ అమ్మ వారి ఆలయంలో అలనాటి నటి కేఆర్ విజయ సీఎం జయలలిత ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. ఇక, జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, ఈ ఏడాది తాను జన్మదిన వేడుకలకు దూరం అని విశ్వనటుడు కమల్‌హాసన్ ప్రకటించారు. నవంబర్ ఏడో తేదీన తన జన్మదిన వేడుకల్ని జరప వద్దని అభిమానులకు సూచించారు.
 
  కాగా, సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ త్వరలో సంపూర్ణ ఆరోగ్య వంతు రాలుగా అమ్మ జయలలిత ఇంటికి చేరుతారని ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చౌదరి చేసిన వ్యాఖ్యలు తమకు మరింత ఆనందాన్ని నింపాయని వ్యాఖ్యానించారు. అమ్మ ఆరోగ్య వంతురాలుగా ఉన్నారని, రాష్ట్ర ప్రజల ప్రార్థనలకు, పూజలకు దేవుడు కరుణ చూపించాడని పేర్కొన్నారు. దేవుడి అనుగ్రహం, ఆశీస్సులు, డాక్టర్ ఉత్తమ సేవలకు అమ్మ ఆరోగ్యవంతు రాలుగా అందరి ముందుకు రానున్నారని ధీమా వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు