ఏసీ వోల్వోతో నష్టమే..

13 Dec, 2014 22:23 IST|Sakshi

ముంబై-నాగపూర్ మధ్య నడుస్తున్న సర్వీసులు
పయాణికుల నుంచి స్పందన నిల్

 
సాక్షి, ముంబై: నాగపూర్-ముంబై ప్రధాన నగరాల మధ్య రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ప్రవేశపెట్టిన ఏసీ వోల్వో బస్సుకు ప్రయాణికుల నుంచి తగినంత స్పందన రావడం లేదు. దీంతో ఈ సేవలు నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు మరింత మెరుగ్గా, వేగవంతంగా సాగేందుకు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల ఆరో తేదీన ఏసీ వోల్వో బస్సు సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు జరుగుతుండటంతో ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు పెరిగి మంచి కలెక్షన్లు వస్తాయని ఆర్టీసీ భావించింది.

కాని సేవలు ప్రారంభించి సుమారు వారం రోజులు కావస్తున్నప్పటికీ వేళ్లపై లెక్కించే విధంగా ప్రయాణికులు ఈ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సులతో పోలిస్తే వీటిలో చార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారు. ముంబై-నాగపూర్ మధ్య సుమారు 900 కి.మీ. దూరం ఉండగా గమ్యం చేరడానికి 17 గంటల సమయం పడుతుంది.  దీని నిమిత్తం ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.2,370 చొప్పున చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రయాణానికి ట్రిప్పునకు 225 లీటర్ల డీజిల్  (సుమారు రూ.15 వేలు) అవసరముంటుంది. దూర ప్రయాణం కావడంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు మధ్యలో మారాల్సి వస్తుంది. అందుకు వారికి రూ.ఐదు వేలు (వేతనం, ఇతర భత్యాలు కలిపి), అదే విధంగా బస్సు నిర్వహణకు (ఇంజిన్ అయిల్ ఇతర పనులకు) రూ.ఐదు వేలు ఖర్చవుతాయి. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు రూ.25 వేలు ఖర్చవుతున్నాయి.

గడిచిన ఈ వారం రోజుల్లో ఒక్కో బస్సుకు సరాసరి ఆదాయం రూ.28 వేల చొప్పున వచ్చింది. దీంతో ఈ బస్సులు నడిపి ప్రయోజనం లేకుండా పోయింది. అదే ప్రైవేటు ఏసీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడికి రూ.1400 వసూలు చేస్తున్నారు. దీంతో చార్జీలు రూ. ఏడు, ఎనిమిది వందల వరకు తగ్గించాలని ఆర్టీసీ ఫేస్ బుక్‌లో, వాట్సప్‌లో ప్రయాణికులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలాగే సమయానికి గమ్యస్థానం చేర్చడం లేదనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.

>
మరిన్ని వార్తలు