28ఏళ్ల తరువాత కలుసుకున్న ప్రేమ జంట

8 Oct, 2018 11:12 IST|Sakshi
సుబ్రమణియం, విజయ

తమిళనాడు, వేలూరు: ఎంజీఆర్‌ శత జయంతి పురస్కరించుకొని జీవిత శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయడంతో 28 ఏళ్ల తరువాత ప్రేమ జంట మళ్లీ కలుసుకుంది. వివరాలు.. శ్రీలంకకు చెందిన బక్కర్‌ ఆలియాస్‌ విజయ (60) శ్రీలంక తమిళుల వైరుద్యం సమయంలో తమిళనాడుకు చేరుకున్నారు. వీధుల్లో నాట్యం అడుతూ జీవనం సాగించేవారు. విజయ నాట్యానికి ఆకర్షిణితులైన సుబ్రమణియం ఆమెను ప్రేమించాడు. సుబ్రమణియం ఇంట్లో వీరి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో సుబ్రమణియం 1985లో విజయతో కలిసి వెళ్లిపోయాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం వీధుల్లో నాట్యం ఆడుతూ జీవనం సాగించే వారు. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ఓ వ్యక్తి విజయపై అత్యాచారానికి యత్నించాడు.

సుబ్రమణ్యన్, విజయ ఆగ్రహంతో అతనిపై దాడి చేయగా తలకు గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుబ్రమణియన్, విజయను అరెస్ట్‌ చేశారు. 1990లో కోవై కోర్టు వారికి జీవిత శిక్ష విధించింది. వేలూరు మహిళా జైల్లో విజయను, పురుషుల జైల్లో సుబ్రమణియన్‌ను ఉంచారు. జైల్లో విజయకు అనారోగ్యం ఏర్పడి మాట పడిపోయింది. దీంతో 2013లో విజయను విడుదల చేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో వేలూరు సమీపం అరియూర్‌లోని వృద్ధాశ్రమంలో చేరారు. ఇదిలాఉండగా ఎంజీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం సుబ్రమణియన్‌ను విడుదల చేశారు. దీంతో సుబ్రమణియన్‌ భార్యను చూసేందుకు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుబ్రమణియన్‌ను చూసి విజయ ఉద్వేగానికి లోనయ్యారు. దీనిపై సుబ్రమణియన్‌ మాట్లాడుతూ.. ఆత్మరక్షణ కోసం తాము చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించామని ప్రస్తుతం సొంత గ్రామానికి  వెళ్లనున్నట్టు తెలిపారు. బంధువులు తమను చేర్చుకోరని అయినప్పటికీ విజయను విడవబోనని వెల్లడించాడు.

మరిన్ని వార్తలు