గుళ్లో ప్రేమపెళ్లిళ్లకు బ్రేక్‌?

25 Nov, 2018 09:45 IST|Sakshi

దేవాదాయశాఖ ఆలోచన  

వివాదాలు రాకూడదనే   

కర్ణాటక / శివాజీనగర: తల్లిదండ్రులను ఎదిరించి గుళ్లో పెళ్లి చేసుకుందామనుకునే ప్రేమ జంటలకు ఇకనుంచి అది కుదరకపోవచ్చు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయాల్లో ఇకపై ప్రేమ జంటలు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దంపతుల్లో ఎవరో ఒకరు ఇతరులతో రావడం, యుక్తవయసు రాని బాల బాలికలు, ఇళ్లలో గొడవపడి వచ్చినవారు ఆలయాల్లో దండలు మార్చుకుని ఒక్కటవుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. ఈ విధగా చట్ట ఉల్లంఘన వివాహం, వివాదాస్పద వ్యక్తులు దేవాలయాల్లో గుట్టుగా పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడి అర్చకులు కేసులను ఎదుర్కొంటున్నారు.  

అర్చకులు సతమతం  
తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఆ ఆలయ అర్చకులను సాక్షులుగా పరిగణిస్తున్నారు. దీంతో అర్చకులు కోర్టు, పోలీసు విచారణకు నిత్యం పరుగులు తీయాల్సి వస్తోంది. దీంతో 1996లోనే ఈ తరహా వివాహాలను జరపరాదని దేవదాయ శాఖ ఒక నోటీస్‌ జారీచేసింది. కానీ ఎవరూ అమలు చేయడం లేదు.  తాజాగా పాత చట్టాన్ని అమలుపరచాలని దేవాదాయశాఖ ఆలోచిస్తోంది. మరికొన్ని సంఘటనల్లో అర్చకులను బెదిరించి వివాహం చేయాలని ఒత్తిడి చేసేవారు.  

అన్ని పత్రాలూ ఉంటేనే అనుమతి  
ఇకపై ఏ వివాహం జరగాలన్నా, తగిన అనుమతి, ఆమోద పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రేమికులు, వివాహం చేసుకునేవారి తల్లిదండ్రుల ఆమోదం ఉంటే, వయస్సు ధ్రువీకరణలతో పాటు ఇతర అవసరమైన అనుమతి పత్రాలు ఉంటే దేవాలయాల్లో సులభంగా వివాహం చేసుకోవచ్చు.   
 

మరిన్ని వార్తలు