రేపటి నుంచి సమ్మె షురూ

24 Feb, 2014 02:22 IST|Sakshi
 సాక్షి, చెన్నై : రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడనున్నది. ఎల్పీజీ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధం అయ్యారు. ఈనెల 25 నుంచి అన్ని రకాల సేవలు నిలుపుదల చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్యాస్ ఏజెన్సీలకు డిసిప్లినరీ గైడ్ లైన్స్ -2014ను అమల్లోకి తెచ్చింది. ఇందులో 17రకాల మార్గదర్శకాలు పొందు పరిచారు. వీటి అమల్లో జాప్యం నెలకొన్న పక్షంలో, వినియోగదారుడికి ఇబ్బందులు తలెత్తినా ఏజెన్సీలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎల్పీజీ  డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేంద్రం దృష్టికి పలు మార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో సమ్మెకు రెడీ అయ్యారు. రాష్ట్రంలోను డీలర్లు ఏకం అయ్యారు. నిరవధిక సమ్మెను జయప్రదం చేయడానికి నిర్ణయించారు. 
 
 సమ్మెకు రెడీ: రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం కార్యదర్శి దక్షిణామూర్తి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, సమ్మె ప్రకటన చేశారు. కేంద్రం నిర్ణయం కారణంగా డీలర్లు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి తమను తీవ్ర కష్టాలు, నష్టాల పాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. కొత్త మార్గ దర్శకాల మేరకు లక్షలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎంఎస్ విధానం మేరకు గ్యాస్ బుక్ చేసిన 48 గంటల్లో సిలిండర్లు వినియోగదారుడికి చేరకున్నా, తమకు జరిమానా విధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డిసిప్లినరీ గైడ్ లైన్స్ విధానాన్ని రద్దు చేయాలని, నగదు బదిలీ అమలు చేయాలా..? నిలిపి వేయాలా..? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
 
 సిలిండర్ సీలు తీయడానికి వీలు లేని రీతిలో సీల్డ్ ప్రూఫ్ సిలిండర్లు అందజేయాలని, బాట్లింగ్ పాయింట్‌లో తూనికల్లో తేడా ఉన్న పక్షంలో, దానికి డీలర్లను బాధ్యులు చేయడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నామన్నారు. గ్యాస్ డెలివరీ, బుకింగ్ , కొత్త గ్యాస్‌ల నమోదు తదితర అన్ని రకాల సేవలు నిలుపుదల చేయనున్నామని ప్రకటించారు. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయాలన్నది తమ అభిమతం కాదని, కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసనగానే ఈ సమ్మె చేపట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తమ సమ్మెకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డీలర్ల సమ్మె దృష్ట్యా, రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువే. ఈ సమ్మె ఎంత కాలం సాగుతుందో,  ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించనుందో వేచి చూడాల్సిందే. 
 
మరిన్ని వార్తలు