గడువు పెంపు

2 Jan, 2015 02:23 IST|Sakshi
గడువు పెంపు

 సాక్షి, చెన్నై : వంట గ్యాస్ సబ్సిడీ నిమిత్తం ‘డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ విధానానికి గాను దరఖాస్తులు చేసుకునేందుకు మరింత గడువు పెంచారు. దరఖాస్తులు చేసుకోని వినియోగదారులకు జూలైతర్వాత సబ్సిడీ రద్దవుతుంది. రాష్ట్రంలో గురువారం నుంచి ఈ సబ్సిడీ విధానం అమల్లోకి వచ్చింది. వంట గ్యాస్ వినియోగదారులకు ఇదివరకు డీలర్ల ద్వారా సబ్సిడీ రూపంలో సిలిండర్ల పంపిణీ జరిగేది. సబ్సిడీ భారం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించే పనిలో పడింది. దేశంలో గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు నేరుగా సబ్సిడీని బ్యాంక్ ద్వారా అందించేందుకు నిర్ణయించింది. ఇందుకుగాను వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను, ఆధార్ నంబర్లను సేకరించే పనిలోపడింది. ఒకే ఇంట్లో రెండు మూడు కనెక్షన్లు ఉన్నా, వాటిని రద్దు చేయడానికి ఈ విధానం దోహదకారిగా మారింది. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీఎల్) విధానం అమల్లోకి తెచ్చేందుకుగాను వినియోగదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పర్వం వేగవంతమైంది. అయితే, రాష్ర్టంలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని చెప్పవచ్చు. గతంలో ఉచిత సింగిల్ సిలిండర్ పథకం అమలు చేసిన దృష్ట్యా, గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ వినియోగం దరిచేరింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతాలు కల్గిన వారి సంఖ్య తక్కువే. అదే సమయంలో ఆధార్ కార్డు మంజూరు అంతంత మాత్రమే.
 
 గడువు పెంపు
 జనవరి ఒకటో తేదీలోపు డీబీటీఎల్ విధానంలో చేరిన వారు పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసుకోవాలి. సబ్సిడీ మొత్తం రెండు లేదా నాలుగు రోజుల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఐవోసీ, హెచ్‌పీ, భారత్ తదితర పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు ప్రకటించాయి. ఆ మేరకు ఈ విధానం రాష్ట్రంలో గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, రాష్ట్రంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గురువారం నాటికి ఆ పథకంలోకి చేరిన వారి సంఖ్య గ్యాస్ వినియోగదారుల సంఖ్య కంటే తక్కువే. ఈ నేపథ్యంలో గడువును పెంచేందుకు సిద్ధయయ్యారు. మార్చి 31వ తేదీలోపు బ్యాంక్ ఖాతా నంబర్లు సంబంధిత డీలర్లకు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక, ప్రతి ఆదివారమూ ప్రత్యేక శిబిరం ఏర్పాటుకు నిర్ణయించారు.
 
 ఈ విషయంగా ఐవోసీ అధికారి వెట్రి సెల్వన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీ విధానంలో అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్న వారందరికీ వారివారి బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ జమ చేయడం జరుగుతుందన్నారు. మరె ందరో వినియోగదారులు దరఖాస్తులు సమర్పించాల్సిన దృష్ట్యా, గడువును పెంచినట్టు తెలిపారు. మార్చి 31లోపు దరఖాస్తులు సమర్పించే వారికి త్వరితగతిన బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ చేస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దరఖాస్తులు చేసుకున్న పక్షంలో వారికి మూడు నెలల అనంతరం బ్యాంక్‌ల్లో సబ్సిడీ జమవుతుందన్నారు. జూన్ నెలఖారుకు ఈ ప్రక్రియను ముగియనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకోని గ్యాస్ వినియోగదారులు శాశ్వతంగా సబ్సిడీని కొల్పోయినట్టేనని స్పష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు