ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించిన ఎల్జీ

4 Aug, 2014 23:15 IST|Sakshi
ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించిన ఎల్జీ

 న్యూఢిల్లీ: డీఎంఆర్సీ కొత్తమార్గాల్లో ప్రవేశపెట్టనున్న ఫీడర్ బస్సులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థ ఆమోదించిన మార్గాల్లో ఇవి సేవలు అందిస్తాయని డీఎంఆర్సీ తెలిపింది. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎల్జీ, తరువాత శాస్త్రిపార్కులోని డీఎంఆర్సీ డిపో, వర్క్‌షాప్‌ను కూడా సందర్శించారు. డీఎంఆర్సీ కార్యాలయాలను సందర్శించడం అద్భుత అనుభవమని ఎల్జీ అన్నారు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన ఫీడర్ బస్సులు ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు సేవలు అందిస్తాయి. వీటిలో మొదటి నాలుగు కిలోమీటర్ల వరకు రూ.ఐదు వసూలు చేస్తారు. పది కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే రూ.10 చెల్లించాలి.
 
 ఇవి విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ నుంచి బురారి, విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ నుంచి గోకుల్పురి మెట్రో, అజాద్‌పూర్ మెట్రో స్టేషన్ నుంచి కన్హయ్య నగర్ మెట్రో స్టేషన్, ఛత్తర్‌పూర్ నుంచి హాజ్‌కాస్ మెట్రో స్టేషన్ మార్గాల్లో సేవలు అందిస్తాయి. ఈ ఏడాది వివిధ మార్గాల్లో డీఎంఆర్సీ ప్రవేశపెట్టబోయే 400 బస్సుల్లో ఇవి భాగమని సంస్థ అధికారులు తెలిపారు. కాలుష్యకారక పరిశ్రమలకు మూత: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశంకాలుష్య కారక పరిశ్రమల మూసివేతకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) జారీ చేసిన ఆదేశాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ ఆదేశాలు జారీ చేశారు.
 
 ఈ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులు ఎవరో తేల్చాలని పట్టణాభివృద్ధిశాఖ డెరైక్టర్‌ను ఆజ్ఞాపించారు. పట్టణాభివృద్ధిశాఖ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. తగినంత మంది డ్రైవర్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీల భర్తీని వెంటనే చేపట్టాలని డీటీసీ చైర్మన్ దేబశ్రీ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. డీటీసీ సమస్యల అధ్యయనం కోసం నియమించే కమిటీలో సీఎండీతోపాటు ముగ్గురు సీనియర్ అధికారులు ఉంటారు. నరేలా బస్టాపులోని మరుగుదొడ్లకు కూడా వెంటనే మరమ్మతులు చేయాలని ఎల్జీ ముఖర్జీని ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు