దళితులకు మేమున్నాం..

3 May, 2014 23:01 IST|Sakshi

ముంబై: ఇటీవల అహ్మద్‌నగర్‌లో దళిత యువకుడి పరువుహత్య, బుల్డాణా జిల్లాలో దళితులను బహిష్కరించడం వంటి దారుణాలపై ప్రభుత్వం స్పందించలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో సర్కారు మేల్కొంది. ఇద్దరు రాష్ట్ర సీనియర్ మంత్రులు ఈ రెండు ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలను శనివారం పరామర్శించి వారికి నష్టపరిహారం ప్రకటించారు. అగ్రవర్ణానికి చెందిన బాలికను ప్రేమించినందుకు అహ్మద్‌నగర్ జామ్‌ఖాడే తాలుకా, ఖార్డా గ్రామవాసి, 17 ఏళ్ల నితిన్‌రాజును హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

 దీంతో గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి మధుకర్ పిఛడ్ ఖార్డాగ్రామంలోని రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఇతడు బాలికతో పొలంలో కనిపించడాన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు యువకుణ్ని కట్టెలతో తీవ్రకొట్టి గొంతు నులిమి చంపారు. తరువాత మృతదేహానికి తాడు కట్టి చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటనపై పిఛడ్ మాట్లాడుతూ రాజు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.ఐదు లక్షలు, ఎన్సీపీ తరఫున రూ.ఐదు లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ హత్యపై ఆయన హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్‌తోనూ చర్చించారు.  ఈ దుశ్చర్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు బాలిక సోదరుడు, ముగ్గురు మైనర్లతోపాటు 11 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. వీరిపై భారత శిక్షాస్మృతితోపాటు ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

 ఇదిలా ఉంటే రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం నితిన్ రావుత్ బుల్డాణా జిల్లాలోని బేలాడ్ గ్రామాన్ని శనివారం సందర్శించారు. ఇక్కడి అగ్రవర్ణాల ప్రజలు దళితులను బహిష్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఇరు వర్గాలతో సమావేశమయ్యారు. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రకటించారు. అవసరమైతే గ్రామపంచాయతీకి నిధులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ అధిపతి సీఎల్ తుల్ కూడా మంత్రి వెంట ఉన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని గ్రామ సర్పంచ్, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమకు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తుల్ మీడియాతో అన్నారు. 

మరిన్ని వార్తలు