విడుదలకు నో..

21 Jul, 2016 02:37 IST|Sakshi
విడుదలకు నో..

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న నళిని దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గత 20 ఏళ్లకు పైగా జైలుశిక్షను అనుభవిస్తున్న కారణంగా తనను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న ఆమె కోర్కెను కోర్టు నిరాకరించింది.
 
 రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళినీ సహా ఏడుగురు వేలూరు జైలు లో యావజ్జీవ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. 20 ఏళ్లకు పైగా జైలుశిక్షను అనుభవించేవారిని విడుదల చేయవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం 1994లో ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం విడుదలకు తాను అర్హురాలిని అంటూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి, జైళ్లశాఖ డీఐజీకి 1994 ఫిబ్రవరిలో నళినీ విజ్ఞప్తి చేశారు.
 
 అయితే ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మద్రాసు హైకోర్టులో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం బదులిస్తూ, నళినీ సహా ఏడుగురు విడుదలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును కోరింది. నళినీ పిటిషన్ బుధవారం విచారణకు రాగా న్యాయమూర్తి సత్యనారాయణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించారు.
 
  రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు మద్రాసు హైకోర్టు వేరుగా నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలులేదని పేర్కొం టూ నళినీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం నళినీ విడుదలపై దాఖలు చేసుకున్న పిటిషన్‌ను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి సూచిం చారు.
 

మరిన్ని వార్తలు