నటి రంజిత పిటిషన్‌పై విచారణ వాయిదా

6 Sep, 2017 09:49 IST|Sakshi
నటి రంజిత పిటిషన్‌పై విచారణ వాయిదా

సాక్షి, తమిళ సినిమా(చెన్నై): స్వామి నిత్యానంద కేసును పునః విచారణ జరిపించాలని నటి రంజిత ఇదివరకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరో వారానికి వాయిదా పడింది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద, నటి రంజిత సన్నిహితంగా ఉన్న వీడియో 2010లో ఒక టీవీ చానల్‌ ప్రసారం చేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది నకిలీ వీడియో అంటూ నిత్యానంద ఆశ్రమానికి చెందిన ఒక నిర్వాహకుడు స్థానిక పాండిబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో కొందరు ఆ వీడియోను చూపి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అందులో శ్రీధర్, లెనిన్, అయ్యప్పన్, ఆర్తిరావ్‌ తదితరులను నేరస్తులుగా పేర్కొని దర్యాప్తు చేశారు. అనంతరం ఈ కేసును సీబీసీఐడీ చేపట్టింది. ఈ కేసు విచారణ స్థానిక సైదాపేట కోర్టులో తుది దశకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో నటి రంజిత మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీసీఐడీ కోర్టుకు దాఖలు చేసిన చార్జ్‌ షీటులో నేరస్తురాలిగా పేర్కొన్న ఆర్తిరావ్‌ ఈమెయిల్‌ను సరిగా పరిశీలించలేదని, ఆమె వినయ్‌ భరద్వాజ్‌ కలిసి కట్ర పన్నారని తన పిటిషన్‌లో రంజిత ఆరోపించారు. వారి ఈమెయిల్‌లను క్షుణంగా పరిశీలించాలని కోరారు.

అదేవిధంగా నిత్యానంద కేసు విచారణ కర్ణాటక కోర్టులో జరుగుతోందని, అక్కడి పోలీసులు అసలు వీడియోను పరిశీలించకుండా నకిలీ వీడియోతో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల ఈ కేసుపై పునఃవిచారణ జరిపించాలని ఆమె కోరారు. కాగా ఈ పిటిషన్‌ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌.రమేష్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. రంజిత తరపున న్యాయవాది ఇళయరాజా హాజరై వాదించారు. ఈ పిటిషన్‌పై తగిన బదులివ్వాల్సిందిగా న్యాయమూర్తి సీబీసీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీచేసి విచారణను మరో వారానికి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు