అమ్మ ఆస్తులు, అప్పులు ఎంత?

5 Apr, 2019 12:17 IST|Sakshi

25లోపు నివేదిక సమర్పించండి

ఐటీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఐటీ వర్గాలను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈనెల 25లోపు సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు ఎంఎం సుందరేషన్, శరవణన్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది.

అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత ఆస్తుల గురించి ప్రత్యేకగా చెప్పనక్కర్లేదు. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లి రావాల్సిన పరిస్థితి. ఆమెకు రూ. 917 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నా, సమగ్ర వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇక ఆమె మరణించినా, ఆస్తుల వివాదం మాత్రం సమసినట్టు లేదు. ఆమె ఆస్తుల పర్యవేక్షణకు ఎవరో ఒకర్ని నియమించాలని చెన్నైకు చెందిన పుహలేంది దాఖలు చేసిన పిటిషన్‌ మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. తామే జయలలితకు, ఆస్తులకు  వారసులు అంటూ ఆమె అన్న జయరామన్‌ కుమారుడు దీపక్, దీప సైతం కోర్టు మెట్లు ఎక్కి ఉన్నారు. ఇటీవల పిటిషన్‌ విచారణకు రాగా, దీపక్‌ తరఫున ఓ వాదన కోర్టుకు చేరింది. కొడనాడు ఎస్టేట్‌ను చెన్నై ఆర్‌ఏ పురంలోని ఓ బ్యాంక్‌లో జయలలిత తాకట్టు పెట్టి ఉన్నారని, ఇందుకుగాను రూ. కోటి 60 లక్షలు చెల్లించాల్సి ఉందని వివరించారు.

అదేసమయంలో జయలలిత 2016 ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంలోని ఆస్తుల వివరాలు, అప్పులు ఎంత? అన్న ప్రస్తావనను కోర్టు తెర మీదకు తెచ్చింది. ఇంతకీ జయలలిత ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు, అక్రమాస్తుల కేసు విచారణలో తేలిన ఆస్తుల వివరాలు, 2016 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆమె ఆస్తుల వివరాలు, అప్పులు తదితర వివరాలను సమర్పించాలని ఇప్పటికే ఓ మారు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో గురువారం పుహలేంది పిటిషన్‌ విచారణకు రాగా, దీపక్‌ తరఫున దాఖలైన మరో పిటిషన్‌ను కోర్టుకు చేరింది. రక్తసంబంధీకుడైన తనను  జయలలిత ఆస్తుల పర్యవేక్షణకు నియమించాలని దీపక్‌ ఆ పిటిషన్‌ ద్వారా కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ పిటిషన్‌ను, పుహలేంది దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారించేందుకు న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, శరవణన్‌ బెంచ్‌ నిర్ణయించింది. ఈ కేసు విచారణ మరింత ముందుకు తీసుకెళ్లాలంటే, జయలలిత ఆస్తులు, అప్పులు ఎంత అన్న లెక్క ముందుగా తేలాల్సి ఉందని బెంచ్‌ అభిప్రాయ పడింది. దీంతో ఈనెల 25వ తేదీలోపు ఆ వివరాలను సమగ్ర నివేదికగా కోర్టుకు సమర్పించాలని ఐటీ వర్గాలకు ఆదేశిస్తూ, అదే రోజుకు విచారణను న్యాయమూర్తులు వాయిదా వేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా