కేంద్ర ప్రభుత్వానికి జరిమానా

17 Nov, 2018 11:50 IST|Sakshi

45 ఏళ్ల పింఛను వడ్డీ సహా చెల్లించాలని ఉత్తర్వులు

వృద్ధురాలికి ఊరట..

తమిళనాడు, టీ.నగర్‌: స్వాతంత్య్ర పోరాటంలో జైలుకు వెళ్లిన సమరయోధుని భార్యకు పింఛను అందజేయకుండా కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వానికి రూ.10 అపరాధం విధిస్తూ గురువారం మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అలాగే, 45 ఏళ్ల పింఛన్‌ మొత్తాన్ని అందజేయాలని ఉత్తర్వులిచ్చింది. స్వాతంత్ర పోరాట సమయంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ భారత జాతీయ సైన్యంలో లక్ష్మణదేవర్‌ ఉన్నాడు. ఇతన్ని 1945 ఆగస్టు నెలలో ఆంగ్లేయ సైన్యం అరెస్టు చేసి మలేషియాలోగల చిత్ర క్యాంప్‌ జైలులో నిర్బంధించింది. తర్వాత ఆయన 1946 ఫిబ్రవరి 28న విడుదలై భారత్‌ చేరుకున్నారు. ఇదిలాఉండగా లక్ష్మణదేవర్‌ 1969లో మృతిచెందారు. ఆయన భార్య కాత్తాయి అమ్మాళ్‌ తనకు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషన్‌ పంపారు.

ఆమె పిటిషన్‌ పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 1970 మార్చి 28న పింఛను అందించేందుకు ఉత్తర్వులిచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ సమరయోధుల పింఛను కోరుతూ కాత్తాయి అమ్మాళ్‌ 1973లో పిటిషన్‌ అందజేశారు. అయితే ఆమె పిటిషన్‌ పరిశీలనకు నోచుకోలేదు. తర్వాత ఆమె రిమైండర్‌ లెటర్‌ పంపినా ఫలితం లేకుండా పోయింది. చివరిగా ఆమె 2002 జనవరి ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్‌ పంపారు. ఈ పిటిషన్‌ పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని నిరాకరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో కాత్తాయి అమ్మాళ్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి ఆర్‌.సురేష్‌కుమార్‌ విచారణ జరిపి తీర్పునిచ్చారు.

పింఛను అందజేయాలి:
స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కోరుతూ 1973లో పంపిన పిటిషన్‌లో తన భర్త జైలులో గడిపిన సర్టిఫికెట్, భర్త డెత్‌ సర్టిఫికెట్‌ వంటి అన్ని దస్తావేజులను తమ వద్ద ఉంచుకున్నారని, అయితే 30 ఏళ్లకు పైగా పరిశీలించకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని, అందుచేత పిటిషనర్‌ కాత్తాయి అమ్మాళ్‌కు సమరయోధుల పింఛను అందజేయాలని, 1973 సెప్టెంబరు 25వ తేదీ నుంచి పింఛను అందజేయాలని, అంతేకాకుండా ఈ మొత్తానికి ఏటా ఆరు శాతం వడ్డీ అందజేయాలని తెలిపారు. అలాగే ప్రతి నెల తప్పకుండా పింఛను అందజేయాలని తెలిపారు. పింఛను కోసం వృద్ధురాలిని ఇన్నేళ్లుగా ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర ప్రభుత్వానికి రూ.10 వేలు కేసు ఖర్చు (అపరాధం) విధిస్తున్నట్లు, ఈ మొత్తాన్ని పిటిషనర్‌ కాత్తాయి అమ్మాళ్‌కు రెండు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం అందజేయాలని ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు