ఎయిమ్స్‌ ఎక్కడ?

22 Jul, 2017 03:00 IST|Sakshi
ఎయిమ్స్‌ ఎక్కడ?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసు
పీజీ కొత్త విధానానికి రెండు వారాల గడవు
హైకోర్టుకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో అన్న విషయాన్ని స్పష్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇక, రాష్ట్రంలో పీజీ వైద్య సీట్ల భర్తీకి కొత్త విధానాల రూపకల్పనకుగాను రెండు వారాల గడువు కోరుతూ ఆరోగ్య శాఖ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇక హైకోర్టుకు బుధవారం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాష్ట్రంలో చెంగల్పట్టు, పుదుకోట్టై, పెరుంతురై, మదురై తోప్పురు, తంజావూరు సెంగిపట్టిలో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటుకు తగ్గ పరిశీలన సాగింది. సీఎంగా జయలలిత ఉన్న సమయంలో మదురై, తంజావూరుల మీద దృష్టి పెట్టే దిశలో కేంద్రానికి లేఖాస్త్రాలు వెళ్లాయని చెప్పవచ్చు. మదురై తోప్పురులో స్థల పరిశీలన కూడా సాగింది.

అయితే, మదురైలో కాకుండా తంజావూరు జిల్లా సెంగిపట్టిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు తగ్గ చర్యల్ని కేంద్రం చేపట్టినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.దీంతో రెండు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల మధ్య, స్వచ్ఛంద సంస్థల, సంఘాల మధ్య వివాదం బయలుదేరింది. తమ ప్రాంతంలో అంటే, తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతూ సాగుతున్న వివాదం శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో మారాయి. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనానికి చేరింది.

బుధవారం న్యాయమూర్తులు సెల్వం, ఆదినాథన్‌ ముందు పిటిషన్‌ విచారణకు వచ్చింది. వాదనల అనంతరం ఎయిమ్స్‌ ఎక్కడ అంటూ ఏర్పాటు చేయబోయే ప్రదేశాన్ని స్పష్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బెంచ్‌ నోటీసులు జారీచేసింది. ఇక, మద్రాసు హైకోర్టులో యూజీ వైద్యులకు పీజీ సీట్ల భర్తీకి సంబంధించి నెలకొన్న గందరగోళం పిటిషన్‌ న్యాయమూర్తులు రాజీవ్, సురేష్‌కుమార్‌  నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు వచ్చింది. వాదనల అనంతరం కొత్త విధానాల రూపకల్పనకు రెండు వారాల గడువు కోరుతూ ఆరోగ్యశాఖ  పిటిషన్‌ దాఖలు చేసింది.

కొత్త న్యాయమూర్తులు: హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి తగ్గ చర్యలు చేపట్టారు. ఆరుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. బుధవారం ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడింది. జిల్లా కోర్టుల్లో పనిచేస్తున్న సీనియర్‌ న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులకు ఈ పదవుల్లో అవకాశం కల్పించారు. ఆ మేరకు భవానీ సుబ్బరామన్, జగదీష్‌ చంద్ర, స్వామినాథన్, దండపాణి, దైవశికామణి, అబ్దుల్‌ కుత్తుష్‌ కొత్తగా నియమించిన వారిలో ఉన్నారు. గురు లేదా శుక్రవారం వీరు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు