మదురై మీనాక్షి వెబ్‌సైట్ హ్యాక్

16 Dec, 2014 02:34 IST|Sakshi
మదురై మీనాక్షి వెబ్‌సైట్ హ్యాక్

వెబ్‌సైట్‌లో పాకిస్తాన్ జెండాలు
     రంగంలోకి సైబర్ క్రైం పోలీసులు
     మదురైపై తీవ్రవాదుల గురి
 
 సాక్షి, చెన్నై:ఆధ్యాత్మికతకు, పర్యాటకానికి నిలయంగా బాసిల్లుతున్న మదురై నగరంపై తీవ్రవాదులు గురి పెట్టినట్టుగా ఇటీవల వెలుగు చూసింది. దీంతో మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి భక్తుడ్ని తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. 200 మందికిపైగా సిబ్బంది నిత్యం భద్రతా విధుల్లో ప్రవేశ మార్గంలో ఉంటున్నారు. అయినా, నగరంలో సాగుతున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యల పర్వం, తరచూ బెదిరింపులు ప్రజల్ని భయాందోళనలో పడేస్తున్నాయి. ఈ పరిణామాలు నగరం భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఏకంగా అమ్మవారి ఆలయ వెబ్‌సైట్‌ను పాకిస్తానీ ముష్కరులు హ్యాక్ చేయడం మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది.
 
 సేవల వివరాలు : అమ్మవారి ఆలయం  మదురై ‘మీనాక్షి’ పేరిట వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు.  ఇందులో ఆలయంలో జరిగే పూజలు, కార్యక్రమాల గురించి పొందు పరిచారు. అలాగే, ఇక్కడ ఎప్పటికప్పుడు సేవలకు సంప్రదించాల్సిన అధికారుల వివరాలు, ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టతను చాటే గ్రంథాలు, రచనలు, తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయానికి మిళితంచేస్తూ మరెన్నో గ్రంథ రచనలు ఈ వెబ్ సైట్‌లో కొలువు దీరాయి. ఇక చెప్పాలంటే అలనాటి మూలికల వైద్యానికి సంబంధించిన ఎన్నో వివరాలు సైతం ఇందులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి ఈ వెబ్‌సైట్ హ్యాక్ అయింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్నాడీఎంకే వెబ్‌సైట్‌తో పాటుగా మరికొన్ని వెబ్ సైట్‌లు హ్యాక్ అరుు్యంది. ఈ కేసుల ఛేదింపులు సైబర్ క్రైంకు శిరోభారంగా మారాయి. తాజాగా, మీనాక్షి అమ్మవారి ఆలయ వెబ్ సైట్ హ్యాక్ కావడంతో సైబర్ క్రైం వర్గాలు పరుగులు తీస్తున్నారుు.
 
 సైట్‌లో పాక్ జెండాలు : మీనాక్షి అమ్మవారి ఆలయ జాయింట్ కమిషనర్ నటరాజన్ ఆలయ వెబ్ సైట్ హ్యాక్ గురి కావడాన్ని గుర్తించారు. ఆలయం వెబ్ సైట్‌లో పాకిస్తాన్ జెండాలు ఎగురుతుండడం, అఫ్జల్ పేరిట కొన్ని నినాదాలు పొందు పరచి ఉండడంతో మదురై పోలీసు కమిషనర్ సంజయ్ మాథూర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం వర్గాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ నుంచి ఈ సైట్‌ను హ్యాక్ చేసినట్టు గుర్తించారు. ఆ వెబ్ సైట్‌లోని పాకిస్తాన్ జెండాలు, హెచ్చరికల నినాదాల్ని తొలగించే పనిలో పడ్డారు. ఆ సైట్ పూర్తిగా ఓపెన్ కాకుండా అండర్ మెయింటెనెన్స్ అని పేర్కొని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. త్వరలో వెబ్ సైట్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని నటరాజన్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు