శాసనసభలో ప్రభుత్వం ప్రకటన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు

11 Jun, 2014 23:58 IST|Sakshi
శాసనసభలో ప్రభుత్వం ప్రకటన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు

- ఇతర మైనారిటీలకు వర్తింపు :
- మంత్రి ఫౌజియాఖాన్ వెల్లడి

ముంబై:  ముస్లింలతోపాటు రాష్ట్రంలోని మైనారిటీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం శాసనసభలో బుధవారం ప్రకటించింది.  బాషాపరమైన మైనారిటీ విద్యాసంస్థలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిసభ అభిప్రాయపడింది. మైనారిటీలకు విద్యా అవకాశాల కల్పనపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ దిలీప్ వల్సేపాటిల్‌పై సూచన చేశారు. దీనికి ఇతర సభ్యులంతా మద్దతు పలికారు. ‘మతపరమైన మైనారిటీలేగాక భాషాపరమైన మైనారిటీలూ ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది సంపన్నులు. సొంతగా విద్యాసంస్థలూ ఉన్నా, పేద, అణగారినవర్గాల వారికి అడ్మిషన్లు ఇవ్వడం లేదు’ అని స్పీకర్ అన్నారు.

సభలో విపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. పేదలకు అడ్మిషన్లు నిరాకరించే విద్యాసంస్థలను వదిలిపెట్టకూడదని స్పష్టీకరించారు. పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే స్పందిస్తూ భాషాపర మైనారిటీల అడ్మిషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సావధాన తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ మాట్లడుతూ ముస్లింలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ఫౌజియా ఖాన్ దీనిపై వివరణ ఇస్తూ త్వరలోనే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీ విద్యాసంస్థల్లో బోధన, సదుపాయాలను మెరుగుపర్చాలని పటేల్ కోరారు. ఈ ప్రతిపాదనపై చర్చ నడుస్తోందని ఫౌజియా అన్నారు. అంతేగాక ముస్లింలతో పాటు సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలూ మైనారిటీలేనని ఆమె వివరణ ఇచ్చారు.
 
మైనారిటీల సంక్షేమ నిధి పెంపు
 మైనారిటీల సంక్షేమ కోసం కేటాయించిన నిధులను రూ.362 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో బుధవారం చర్చ నడిచినప్పుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.280 కోట్లు, ఇటీవలి బడ్జెట్‌లో రూ.82 కోట్లు కేటాయించామన్నారు. దీనిని ఈ ఏడాది రూ.500 కోట్లకు పెంచుతామన్నారు.
 
మహిళల భద్రతపై రాజీ లేదు : పాటిల్
 మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా వైర్‌లెస్ కార్ల సేవలను వినియోగించుకుంటామని హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సభలో బుధవారం ప్రకటించారు. వీటిని కేవలం మహిళల రక్షణ కోసమే ఉపయోగిస్తారని చెప్పారు. శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో నడిచిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు.
 
దళితులు, మైనారిటీలు, మహిళలు, వయోధికులు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. హోంశాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.13,342 కోట్లు కాగా, వాటిలో రూ.150 కోట్లు సీసీటీవీల ప్రాజెక్టుకు, రూ.440 కోట్లు పోలీసుశాఖ ఆధునీకరణకు కేటాయిస్తామని పాటిల్ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు