మహాబలిపురానికి మహర్దశ

13 Mar, 2015 00:07 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక నేపధ్యం కలిగిన మహాబలిపురానికి మహర్దశ పట్టనుంది. సముద్రతీరంలో వెలిసిన మహాబలిపురంలోని ప్రకృతి రమణీయ దృశ్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపురానుంది. బండరాళ్లపై చెక్కిన అద్భుత శిల్ప సౌందర్యానికి అందలమంతటి గౌరవం దక్కనుంది. చెన్నైకి దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం కాంచీపురం జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు మామల్లపురంగా ఉండి క్రమేణా మహాబలిపురంగా మారింది. భారతీయులు తమ వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు ఇక్కడి సముద్రమార్గం గుండా వెళ్లేవారు. 7వ దశాబ్దంలో దక్షిణభారతదేశాన్ని ఏలిన ప్రముఖ మహారాజులైన పల్లవులు మహాబలిపురాన్ని నిర్మించనట్లు చరిత్ర చెబుతోంది. ఎంతో కళాత్మక దృష్టి కలిగిన పల్లవరాజులు ఎందుకూ పనికిరాని బండరాళ్ల నుండి అధ్బుత శిల్ప సౌందర్యాన్ని వెలికితీసారు. నృత్యభంగిమలు, ఏనుగులు, గుహలు, ఆలయ గోపురాలు ఇలా వేలాదిగా శిల్ప సౌందర్యం పల్లవరాజుల కళాతృష్టకు అద్దం పడుతుంది. ఒక బ్రిటీష్ రాజు ఇక్కడి ప్రాచీన శిల్పసౌందర్యాలకు 1827లో మరింతగా మెరుగులు దిద్దారని తెలుస్తోంది.

ప్రస్తుత 21 వ శతాబ్దంలోనూ ఇక్కడికి చేరుకునే సందర్శకులను అబ్బురపరుస్తోంది. సముద్ర తీరంలో ఉండటం వల్ల అక్కడి అలల ఘోష శ్రావ్యమైన సంగీతంగా మారిపోతుంది. విదేశాల నుండి వచ్చే పర్యాటకుల్లో అధికశాతం మహాబలిపురాన్ని సందర్శించకుండా వెళ్లరు. విదేశీయులు ఇక్కడి హోటళ్ల రోజుల కొద్దీ బసచేసి మహాబలిపురం ఆందాలను తమ కెమారాల్లో బంధిస్తుంటారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులతో మహాబలిపురం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది.ప్రపంచంలోని అతిముఖ్యమైన హెరిటేజ్ ప్రాంతంగా మహాబలిపురాన్ని యునెస్కో చేర్చింది. ప్రపంచ ప్రజలను ఆకర్షించేస్థాయిలో మెచ్చదగిన పర్యాటక ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. అంతేగాక దీనికి మరింత మెరుగులు దిద్ది అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించేందుకు సిద్దం అయింది. శిల్పకళా సౌందర్యం వెల్లివిరిసే ప్రాంతాలను గుర్తించేందుకు చైనా, బంగ్లాదేశ్, కువైట్ దేశాలను పర్యటించిన యునెస్కో లోని 8 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఇటీవల భారత్‌కు వచ్చిన సమయంలో మహాబలిపురాన్ని సంద ర్శించింది. ఒక ప్రయివేటు సంస్థకు చెందిన థియేటర్‌లో మహాబలిపురంపై చిత్రీకరించిన త్రీడీ యానిమేషన్ చిత్రాన్ని తిలకించింది.








 

మరిన్ని వార్తలు