మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ 30న?

27 Dec, 2019 14:40 IST|Sakshi
బాలాసాహెబ్‌ థోరట్‌

ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 30న జరిగే అవకాశమున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు దాదాపు 36 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆ వర్గాల అంచనా. ప్రస్తుతం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మంత్రివర్గంలో ఆరుగురు సభ్యులున్నారు. ముంబైలోని విధాన్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్న తెలుస్తోంది. విస్తరణలో కాంగ్రెస్‌ తరఫున మంత్రులయ్యే వారి జాబితా సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్‌ థోరట్‌ గురువారం వ్యాఖ్యానించారు. 

మంత్రివర్గ విస్తరణ ఈ వారంలోనే జరగాల్సి ఉండగా... వచ్చే వారానికి వాయిదాపడేందుకు కారణమేమిటన్న ప్రశ్నకు థోరట్‌ సమాధానమిస్తూ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం రాష్ట్రపాలన వ్యవస్థ మొత్తం గతవారం వరకూ నాగ్‌పూర్‌లో ఉందని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి అధికారం దక్కించుకోవడం తెల్సిందే. అధికార పంపిణీలో భాగంగా శివసేనకు 16 మంత్రివర్గ స్థానాలు దక్కనుండగా, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 స్థానాలు లభించనున్నాయి. (చదవండి: కొత్తమలుపులో శివసేన రాజకీయం)

మరిన్ని వార్తలు