అత్యాచార, యాసిడ్ బాధితులకు ఆర్థిక సాయం అందజేయండి

25 Jul, 2013 23:14 IST|Sakshi

 ముంబై: అత్యాచారానికి, యాసిడ్ దాడులకు గురై... మానిసికంగా, శారీరకంగా క్షోభను అనుభవిస్తున్న బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిని అత్యవసరంగా ఆదుకోవాల్సిన అవసరముంద నే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వారికి ఆర్థికంగా అండగా నిలిచేలా ఓ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని సూచించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇలాంటి బాధితుల కోసం ఏదైనా పథకం అమలవుతున్నప్పటికీ రాష్ట్ర పరిధిలో మరో పథకాన్ని అమలు చేయాలని డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ఎస్‌సీ ధర్మాధికారి, ఎస్‌బీ శుక్రేతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘ఫోరమ్ ఎగెనైస్ట్ అప్రెషన్ ఆఫ్ ఉమెన్’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందిస్తూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార, లైంగిక, యాసిడ్ దాడులకు గురై, శారీరక, మానసిక క్షోభను అనుభవిస్తున్నవారికి వైద్యసాయంతోపాటు ఆర్థిక సాయం కూడా అందజేయాల్సిన అవసరముందని, బాధితులకు బతుకుదెరువు కూడా చూపాలంటూ సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రంలో కూడా అమలు చేయాలంటూ పిటిషన్‌లో కోర్టును కోరారు.
 
 రెండు నెలల్లో అమలు చేస్తాం...
 రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు ఆదేశాలపై స్పందిస్తూ... రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు రూపొం దించామని, వాటిని రాష్ట్ర హోంశాఖకు పంపామన్నారు. మరో రెండు నెలల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు. దీంతో కోర్టు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ‘భారత ప్రభుత్వం 2010, డిసెంబర్ 9న ఈ విషయమై మార్గదర్శకాలు జారీ చేసింది. మనం ఇప్పుడు 2013లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మహిళలపై, చిన్నపిల్లలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, యాసిడ్ దాడులు జరుగుతున్న సంఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేస్తున్నారు. ఇది వాయిదా వేయాల్సిన చర్య కాదు. అవసరమైన ంత సమయం తీసుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజల సంక్షేం దృష్ట్యా అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. రెండు నెలల వ్యవధిలో తీసుకుంటామని చెబుతున్నారు. ఇంకా దాని వ్యవధిని పొడిగించవద్దు. వెంటనే పథకాన్ని ప్రకటించి, ఎనిమిది వారాల్లో అమలు చేయాల’ని న్యాయమూర్తి ధర్మాధికారి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు