‘లోక్‌సభ ఎన్నికల తర్వాత సచిన్‌కు సన్మానం’

13 Feb, 2014 23:17 IST|Sakshi

ముంబై: భారత్ క్రికెట్ జట్టుకు అసామాన్య సేవలందించి రిటైర్డ్ అయిన ముంబైకర్ సచిన్ టెండూల్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేసే కార్యక్రమం మరో మూడు నెలలు ఆలస్యమయ్యే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమం ఉండొచ్చని ప్రభుత్వ సీనియర్ మంత్రి ఒకరు గురువారం తెలిపారు. గతేడాది నవంబర్‌లో 200వ టెస్టు మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సచిన్‌ను గౌరవించే విధివిధానాలను రూపొందించేందుకు ఇప్పటికే సర్కార్ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసిందని ఆయన గుర్తు చేశారు.

 లోక్‌సభ ఎన్నికలు సమీపంలో ఉండటంతో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేయడం సాధ్యమయ్యే పని కాదన్నారు. సాధారణ కేబినెట్ సమావేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తీరిక లేకుండా ఉందని వివరించారు. సచిన్‌కు సన్మానం చేసే తేదీని ఇప్పటివరకు నిర్ణయించలేదన్నారు. ఆయను సంప్రదించిన తర్వాతే తేదీని ఖరారు చేస్తామని వివరించారు. భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్నను అందుకున్న సచిన్‌ను సన్మానించే కార్యక్రమ విధివిధానాలకు తుదిరూపు ఇచ్చే ప్రక్రియలో కమిటీ ఉందన్నారు.

 క్రీడల, యువ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ కమిటీకి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్ని విధాల మద్దతు ఇస్తున్నారని తెలిపారు.  క్రికెట్‌లో సచిన్ సేవల వల్ల మహారాష్ట్ర పేరు కూడా దశదిశలా వ్యాపించిందన్నారు. అందరూ మంత్రుల సంతకాలు ఉన్న ప్రత్యేక రజత ట్రోఫీని సచిన్‌కు ప్రదానం చేయనున్నామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు