నేడు చెన్నైకు విద్యాసాగర్‌రావు

2 Sep, 2016 09:53 IST|Sakshi

ఇన్‌చార్జ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం
తమిళ ప్రజలకు రోశయ్య కృతజ్ఞతలు
 
తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్‌గా నియమితులైన మహారాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావు శుక్రవారం చెన్నైకు రానున్నారు. రాజ్ భవన్‌లో ఇన్‌చార్జ్ గవర్నర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రస్తుత గవర్నర్ కొణిజేటి రోశయ్య బాధ్యతల నుంచి తప్పుకోని... తమిళ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 చెన్నై : తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ గవర్నర్‌గా తెలుగు వారైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. దీంతో ఆయన తన బాధ్యతల్ని స్వీకరించేందుకు సిద్ధం అయ్యారు. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన చెన్నైకు రానున్నారు.
 
 రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఇన్‌చార్జ్ గవర్నర్‌గా విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం తదుపరి తన బాధ్యతల్ని విద్యాసాగర్ రావుకు రోశయ్య అప్పగించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ప్రమాణ స్వీకారం జరగనున్నది.
 
ఈ కార్యక్రమంలో సీఎం జయలలితతోపాటుగా మంత్రులు, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. కాగా, బాధ్యతల నుంచి తప్పుకోనున్న ప్రస్తుత గవర్నర్ రోశయ్య తమిళ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఇందుకు తగ్గ ప్రకటనను గురువారం రాత్రి సిద్ధం చేశారు. గవర్నర్ గా బాధ్యత గల పదవిలో ఐదేళ్ల పాటుగా పనిచేసిన తనకు ఎన్నో మధుర స్మృతులు మిగిలాయని రోశయ్య పేర్కొన్నారు.
 
సంస్కృతిని అమితంగా గౌరవించే ఇక్కడి ప్రజలకు తన వంతు సేవ అందించే అవకాశం దక్కిందన్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలితతో పాటు ఆమె మంత్రి వర్గంలోని సహచరులకు, రాజకీయ పార్టీల నాయకులకు, మాజీ, ప్రస్తుత వీసీలకు, విద్యా మేధావులు, వివిధ విభాగాల్లోని వారికి, మీడియా మిత్రులకు, రాజ్ భవన్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తె లుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు తన మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, వారందరికి  హృదయ పూర్వకంగా అభినందనలు రోశయ్య అభినందనలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు