మోసకారి సర్కార్

21 Sep, 2013 03:07 IST|Sakshi

ముంబై: రిజర్వేషన్లపై మరాఠా ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విపక్ష నేత వినోద్ తావ్డే ఆరోపించారు. విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాలంటే తమనూ ఓబీసీలో చేర్చాలని కొంతకాలంగా మరాఠాలు డిమాండ్ చేస్తుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నారాయణ్ రాణే నేతృత్వంలో ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్ష నేత వినోద్ తావ్డే శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి, కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు.
 
 ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మరాఠాల రిజర్వేషన్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లనేవి ఉద్యోగాలు, చదువులకు మాత్రమే పరిమితం కావాలని, రాజకీయ రిజర్వేషన్లను రూపుమాపాలన్నారు. మరాఠాల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే రిజర్వేషన్లపై వారి అభిప్రాయమేమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరిస్తుంటే వెంటనే రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ఈ విషయమై తావ్డే పార్టీ సీనియర్ నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేను కలిశారు. మరాఠాల విషయంలో నిజాయతీగా వ్యవహరించి, నిర్ణయం తీసుకోవాలని కోరారు.

>
మరిన్ని వార్తలు