మహిళలకు 33 శాతం ఇళ్లు

2 Sep, 2013 23:19 IST|Sakshi
 సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మాడా) నిర్మిస్తున్న ఇళ్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఇక మీదట మాడా నిర్వహించే లాటరీ ప్రక్రియ ద్వారా మహిళలకు ప్రత్యేకంగా 33 శాతం ఇళ్లు లభించనున్నాయి. దీన్ని అన్ని వర్గాల మహిళలకూ అమలు చేయాలని యోచిస్తున్నారు. సుధారణ సమితి చేసిన ఈ సిఫార్సుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే సొంతగూటి కోసం మహిళలు కంటున్న కలలు సాకారం కానున్నాయి. ఇదివరకే మాడా ముంబైతోపాటు పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో అనేక ఇళ్లు నిర్మించింది. వాటిని పేదలకు చౌక ధరలకే అందజేయాలని నిర్ణయించింది. 
 
 అర్హుల నుంచి బ్యాంక్ లేదా అన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఇందులో ఉన్నత, మధ్య తరగతి, పేదలు ఇలా వివిధ వర్గాల కోసం ఇళ్లు కేటాయిస్తారు. లాటరీలో ఇళ్లు వచ్చిన వారికి తదనంతరం అందజేస్తారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా కోటా లేకపోవడంతో వీరికి అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి.దీంతో 33 శాతం రిజర్వేషన్ అమలుచేస్తే అన్ని వర్గాల మహిళలకు సొంతిళ్లు లభిస్తాయని మాడా అభిప్రాయపడుతోంది. దీనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన అమలుకు మాడా నియమావళిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. న్యాయనిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తరువాత ఒక నిర్ణయానికి వస్తామని మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి తెలిపారు.
 
 ఇదిలాఉండగా యుద్ధాల్లో గాయాలైన, అమరులైన సైనికుల కుటుంబాలు, విధినిర్వహణలో మరణించిన పోలీసులు, అంధులు, వికలాంగులు, మానసిక వికలాంగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల్లో పనిచేసేవారికి కూడా రిజర్వేషన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు గవయి వెల్లడించారు.అయితే ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ కాబట్టి చర్చోపచర్చల తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తరువాత రూపొందించే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 
 
>
మరిన్ని వార్తలు