ఆర్టీసీకి రూ. 23 కోట్ల నష్టం

22 Nov, 2016 16:14 IST|Sakshi
ఆర్టీసీకి రూ. 23 కోట్ల నష్టం
ముంబై: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పేదలకు, సామాన్యులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా భారీగా పడింది. గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) పై భారీగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, జీపులు తదితర ప్రైవేటు వాహనాలు పోటీకి రావడంతో ఆర్టీసీకి ప్రయాణికులు కరువయ్యారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 500, రూ.1,000 నోట్ల స్థానంలో రూ. 2,000 నోటు రావడంతో చిల్లరతో ఇబ్బందిపడలేక ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ముఖం చాటేస్తున్నారు. గత వారం, పది రోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఆర్టీసీ పరిస్థితి ‘మూలిగే నక్కమీద తాటిపండు’ చందంగా మారింది.
 
ఫలితంగా గడచిన 10 రోజుల్లో ఆర్టీసీకి ఏకంగా రూ. 23 కోట్ల నష్టం వాటిల్లింది. వాస్తవానికి...అక్టోబరు 28 నుంచి నవంబరు 15 వరకు పాఠశాలలకు, కళాశాలకు దీపావళి సెలవుల్లో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, సెలవులు ప్రకటించిన 10 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది. నల్ల ధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాన నరేంద్ర మోదీ ఈ నెల 8న రాత్రి ప్రకటించారు. దీంతో జనమంతా నోట్ల మార్పిడి కోసం, డబ్బులు డిపాజిట్ చేయడానికి బ్యాంకులు, కొత్త నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ తిరగసాగారు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. కొత్త నోట్లు ఉన్నప్పటికీ చిల్లర కోసం కొందరు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు కొత్త కరెన్సీ చేతుల్లో లేక తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు.
 
మరిన్ని వార్తలు