మరాఠాలకు ‘మహా’ వరాలు

9 Aug, 2017 18:14 IST|Sakshi
మరాఠాలకు ‘మహా’ వరాలు

ముంబయి: డిమాండ్ల సాధన కోసం ముంబయిలో మహాప్రదర్శన చేపట్టిన మరాఠాలను సంతృప్తి పరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వారికి వరాల జల్లు కురిపించింది. ఓబీసీలకు కల్పించే విద్యా రాయితీలను మరాఠాలకూ వర్తింపచేయనున్నట్టు మహా సర్కార్‌ స్పష్టం చేసింది. మరాఠా విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణం కోసం ప్రతి జిల్లాలో స్థలం కేటాయించడంతో పాటు రూ 5 కోట్ల నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఉద్యోగాల్లో కోటా అంశాన్ని పరిశీలించేందుకు బీసీ కమిషన్‌కు నివేదిస్తామని తెలిపింది.

మరాఠా మోర్చా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి దేవేం‍ద్ర ఫడ్నవీస్‌ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు.  ఉద్యోగ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు, రైతు రుణ మాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కోరుతూ మరాఠాలు కొంత కాలంగా ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా ర్యాలీలు నిర్వహించిన మరాఠా మోర్చా ముంబయిలో బుధవారం నిర్వహించిన ప్రదర్శనకు 10 లక్షల మందికి పైగా మరాఠాలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి హామీలతో మరాఠాలు తమ ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు