హరహర మహాదేవ

18 Feb, 2015 02:32 IST|Sakshi

హొసూరు/కెలమంగలం/క్రిష్ణగిరి :  మహాశివరాత్రి సందర్భంగా క్రిష్ణగిరి జిల్లాలోని ఈశ్వరాలయాలకు మంగళవారం వేకువ జాము నుంచి భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకొన్నారు. క్రిష్ణగిరి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో విశేషపూజలు, రథోత్సవాలు, హోమాలు, తీర్థప్రసాద వినియోగాలతో పాటు అన్నదానం, వివిద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

హొసూరు తాలూకా ఎస్.ముదుగానపల్లిలో ప్రసిద్ద శ్రీ ప్రసన్నపార్వతీసమేత అమృత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి 9 గంటలకు ఊంజల సేవతో కార్యక్రమం ప్రారంభమైయ్యింది. మంగళవారం ఉదయం 6 గంటలకు గణపతి ప్రార్థన, కలశారాధన, నవగ్రహ, గణపతి హోమం, రథసంప్రోక్షణం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉత్సవ మూర్తులను రథంలో ఉంచి రథోత్సవాన్ని జరిపారు. సాయంత్రం 6 గంటలకు అభిషేకం, రుద్రపారాయణం జరిగింది. మధ్యాహ్నం మహామంగళారతి, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటలకు తిరుమలతిరుపతి దేవస్థానం కళాకారిణి విజయకుమారి భాగవతారణిచే హరికథా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్. ముదుగానపల్లి చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త వి. గోవిందరెడ్డి నేతృత్వంలో గ్రామస్థులు ఏర్పాటు చేశారు. పంచాయతీ అధ్యక్షులు పద్మావతి, మాజీ అధ్యక్షులు లోకేశ్‌రెడ్డి, శాంతమ్మ, నివృత ఉప విద్యాశాఖాధికారి మునిరెడ్డి, గ్రామపెద్దలు రమేశ్‌రెడ్డి, రవి టీచర్, వి.లోకేష్‌రెడ్డి, ఎం.బాబురెడ్డి, లోకేష్, కౌన్సిలర్ రమేష్, సహకార బ్యాంక్ అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి, జిల్లా కౌన్సిలర్ శేఖర్, అప్పోజిరెడ్డి, హొసూరు యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేశ్ తదితరులు పాల్గొన్నారు.

హొసూరులో

చారిత్రక ప్రసిద్ది పొందిన శ్రీ మరకత సమేత చంద్రచూడేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. మంగళవారం వేకువ జామునుండే స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని చంద్రచూడేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్పించుకొన్నారు. ప్రత్యేక అలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. తీర్థప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హొసూరు నంజుండేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. విశేష పూజలు, భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. కాళేశ్వరంలో కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. బాగలూరులో ఈశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
 
కెలమంగలం


బేవనత్తం వద్ద గల శివానంజుండేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు మంగళవారం ఆలయం వద్దకు చేరుకొని కొండపై కొలువైన కైలాసనాథున్ని దర్శించుకొన్నారు. కెలమంగలం నుండి, డెంకణీకోట నుండి  బేవనత్తంకు ప్రత్యేక ఆర్టీసి బస్సులు నడిచాయి. ప్రైవేట్ వాహనాలు, టెంపోలలో భక్తలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివెళ్లారు.  సోమవారం రాత్రి సాసువుల చిన్నమ్మ తెలుగు సామాజిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 50 గ్రామాలకు చెందిన ప్రజలు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. వీరికి అన్నదానం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి కురుక్షేత్రం పౌరాణిక నాటక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శివనపల్లి చెన్నవీరభద్రస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుందుకోట సమీపంలోని మల్లిఖార్జునదుర్గంపై  నెలగొన్న మల్లిఖార్జునస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగింది. తళి, గుమ్మళాపురం, గ్రామాల్లో, అగ్గొండపల్లిలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.
 
సూళగిరిలో


సూళగిరిలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పేరండపల్లి సమీపంలోని శివశక్తి నగర్‌లో అర్థనారే శ్వరమ్మస్వయంబు దేవాలయంలో శివరాత్రి పండుగ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోరుద్రాభిషేకం, కళశస్థాపన, ప్రాకారోత్సవం, అనంతరం రథోత్సవం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు