ఎంజీ వర్సిటీ తొలి స్నాతకోత్సవం ప్రారంభం

5 May, 2017 12:08 IST|Sakshi
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరయ్యారు. జేఎన్టీయూ న్యూఢిల్లీ వీసీ ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ కూడా హాజరయ్యారు. వీరికి యూనివర్సిటీ వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిష్ట్రార్‌లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూనిర్సిటీ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన 40 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 84 మందికి మెరిట్ సర్టిఫికెట్స్ అందజేయనున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
 
విద్యార్థుల అరెస్ట్‌
స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతున్న సందర్భంగా కొంతమంది విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రాత్రి యూనివర్సిటీ హాస్టల్స్‌లోని విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నల్లగొండలోనూ పలు విద్యార్థి సంఘాల నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్నాతకోత్సవాన్ని యూనివర్సిటీలో కాకుండా ఓ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించి ఎంపిక చేసుకున్న విద్యార్థులను మాత్రమే అనుమతించారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థుల్లో కొందరు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తూ విద్యార్థులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వీసీ, రిజిస్ట్రార్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

 

మరిన్ని వార్తలు