తమిళంలో సెల్వేందన్‌గా శ్రీమంతుడు

6 Aug, 2015 02:52 IST|Sakshi
తమిళంలో సెల్వేందన్‌గా శ్రీమంతుడు

 ప్రిన్స్‌గా, సూపర్‌స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం శ్రీమంతుడు. మిర్చి వంటి విజయవంతమైన చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అందాల తార శ్రుతిహాసన్ కథానాయికి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ, క్రేజీ చిత్రానికి చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు సహనిర్మాతగా వ్యవహరించడం విశేషం. దేవీశ్రీప్రసాద్ సంగీత బాణీలు అందించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో సెల్వేందన్ పేరుతో భద్రకాళీ ఫిలింస్ అధినేత ప్రసాద్ రూపొందిస్తున్నారు.
 
  తమిళ వెర్షన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నగరంలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిర్వహించారు.చిత్ర యూనిట్‌తో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా నటుడు జగపతిబాబు మాట్లాడుతూ 22 ఏళ్ల క్రితం చెన్నైలో ఉన్నప్పుడు పెద్దరికంలో హీరోగా నటించానని అందులో హీరోయిన్‌గా సుకన్య నటించారని గుర్తు చేశారు. 22 ఏళ్ల తరువాత ఇప్పుడు అదే సుకన్యతో కలిసి ఈ చిత్రంలో మహేశ్‌బాబుకు తల్లిదండ్రులుగా నటించినట్లు తెలిపారు. ప్రేక్షకులు సెల్వేందన్ చిత్రాన్ని విజయవంతం చేస్తారనే నమ్మకం ఉందన్నారు.
 
 తమిళ నిర్మాతల మండలి కార్యదర్శి టి శివ మాట్లాడుతూ తెలుగులో తన మోస్ట్ పాపులర్ హీరో మహేశ్‌బాబు అని అన్నారు. మరో కార్యదర్శి పీఎల్ తేనప్పన్ ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే సూపర్‌స్టార్ చిత్ర  ట్రైలర్ చూసినట్లుందన్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ఇది సొంత చిత్ర కార్యక్రమంలా ఉందన్నారు. ఇది మంచి ఎంట్రీ. మహేశ్‌బాబు తమిళంలో మరిన్ని చిత్రాలు చెయ్యాలని ఎడిటర్ మోహన్ ఆకాంక్షించారు. మహేశ్‌బాబు తమిళనాట శ్రీమంతుడిగా మారతారు. బాహుబలి తరువాత సెల్వేందన్ పెద్ద హిట్ అవుతుందని ఏఎం రత్నం అన్నారు.
 
 మహేశ్ తండ్రి కృష్ణ నటించిన రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాన్ని చెన్నైలో విడుదల చేసి చాలా సంపాదించానని,ఆ తరువాత తాను నిర్మించిన కందసామి చిత్రంలో కృష్ణగారు ముఖ్య పాత్ర పోషించారనని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్ థాను తెలిపారు.అద్భుతంగా అభినయించే మహేశ్‌ను ఎర్ర తివాచీతో కోలీవుడ్‌కు ఆహ్వానిస్తున్నామని అన్నారు.
 
 చాలా సంతోషంగా ఉంది
 చివరిగా మహేశ్‌బాబు మాట్లాడుతూ తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్ తన చిత్రం తెలుగు,తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలవుతోంది.చాలా సంతోషంగా ఉందన్నారు. చాయాగ్రాహకుడు మది సూచన మేరకే శ్రీమంతుడు చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్ర ఆడియో ఆంధ్రాలో విశేష ఆదరణ పొందింది.తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. దేవిశ్రీప్రసాద్ చాలా మంచి సంగీత బాణీలు అందించారని మహేశ్ అభినందించారు. చిత్ర నిర్మాత భద్రకాళీ ప్రసాద్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు