అంతా ఓం ప్రకాష్ ఇష్టం

7 Oct, 2016 17:09 IST|Sakshi
అంతా ఓం ప్రకాష్ ఇష్టం
  • అది జైలు.. కేజీహెచ్.. ఏదైనా కావచ్చు..
  • మొద్దు శీను హత్యకేసు ముద్దాయి ఇష్టారాజ్యం
  • విచ్చలవిడిగా ఫోన్ల వాడకం..
  • అడుగడుగునా ఖాకీల నిర్లక్ష్యం
  •  
    మల్లెల ఓంప్రకాష్.. ఈ పేరు ఎక్కడైనా, ఎప్పుడైనా విన్నారా?.. ఏమిటీ.. గుర్తు రావట్లేదా!.. అయితే ఇంకో క్లూ.. పరిటాల రవి హత్య కేసు.. ఆ కేసులో నిందితుడైన మొద్దు శీనును జైల్లోనే మట్టుబెట్టిన వ్యక్తి... ఇప్పుడు గుర్తుకొచ్చాడు కదూ.. అవును.. అతనే ఈ ఓంప్రకాష్.. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు..ముద్దాయి జైల్లోనే ఉంటాడు కదా.. ఇప్పుడెందుకా ప్రస్తావన అంటారా?!.. ఆగండాగండి.. అక్కడికే వస్తున్నాం.. కిడ్నీ సమస్యతో వారంలో రెండు రోజులు చికిత్స కోసం కేజీహెచ్‌కు వస్తున్న సదరు ఓం ప్రకాష్‌గారి చిన్నెలు.. ఆయనకు యథాశక్తి సహకరిస్తున్న పోలీసుల పనితనాన్ని పాఠకులకు చెప్పడానికే ఈ ప్రయత్నం..
     
    చికిత్స పేరుతో తరచూ కేజీహెచ్‌కు వస్తున్న ఓంప్రకాష్ ‘సెల్’గాటం.. ఆయనతో ఎస్కార్ట్ పోలీసుల చెట్టపట్టాలు.. కనీసం యూనిఫారం, ఆయుధాలు కూడా లేకుండా ముద్దాయితో కలిసి చేస్తున్న స్వేచ్ఛా విహారాలు.. గత రెండు నెలలుగా ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో బట్టబయలయ్యాయి.
     
    విశాఖపట్నం: మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు రాష్ట్రంలోనే సంచలనం రేపిన విషయం తెలియనిది కాదు. ఆ కేసులో నిందితుడైన మొద్దు శీనును అనంతపురం జిల్లా రెడ్డిపల్లి జైల్లో మట్టుబెట్టిన సంఘటనా అంతే సంచలనం సృష్టించింది. ఆ కేసులో ముద్దాయి అయిన మల్లెల ఓం ప్రకాష్ గత మూడు నెలలుగా విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు. వాస్తవానికి నెల్లూరు జిల్లా జైలులో ఉన్న అతనికి కిడ్నీ సమస్య రావడంతో డయాలసిస్ అవసరం ఏర్పడింది.

    కొద్ది వారాల పాటు నెల్లూరు నుంచి తిరుపతి స్విమ్స్‌కు తీసుకువెళ్లారు. అయితే నెల్లూరు-తిరుపతి మధ్య 150 కిలోమీటర్ల దూరం, రానుపోను ఖర్చులు, భద్రత, ఆర్ధికభారం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జైళ్ల శాఖ అధికారులు ఓంప్రకాష్‌ను గత జూన్‌లో విశాఖ సెంట్రల్ జైలుకు మార్చారు.

    ఇక్కడ కింగ్‌జార్జ్ హాస్పిటల్(కేజీహెచ్)లో డయాలసిస్ యూనిట్ ఉండటంతో వారంలో రెండుసార్లు(బుధ, శనివారాలు), అవసరమైనప్పుడు మూడుసార్లు కూడా తీసుకువస్తున్నారు. ఇక్కడ వరకు అంతా ఓకే గానీ.. డయాలసిస్ కోసం బయటకు వచ్చినప్పుడు అతడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నాడని తెలుస్తోంది.
     
    ఇష్టారాజ్యంగా ఫోన్ల వాడకం
    డయాలసిస్‌కు వచ్చిన మొదట్లో ఆస్పత్రి ఉద్యోగులకు డబ్బులిచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడేవాడు. ఆ తర్వాత జైల్లో సహఖైదీగా ఉన్న గంజాయి కేసు ముద్దాయి భార్య.. ఓం ప్రకాష్ వచ్చినప్పుడు కేజీహెచ్‌కు రావడం.. ఆమె ఫోన్ తీసుకుని అతను ఎవరెవరితోనో మాట్లాడటం తరచూ జరుగుతోందని సమాచారం. ఆమె సెల్‌తోనే గుత్తిలో డిప్లొమా చదువుతున్న తన కుమారుడు సాయికుమార్‌కు ఓంప్రకాష్ ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
     
    ఈ ఫోన్ నెంబర్ సిమ్ ప్రకాష్ భార్య పేరిట ఉందని అంటున్నారు. కుమారుడితోనే కదా... అని ఒకింత మానవీయ కోణంలో చూడొచ్చు. కానీ కుమారుడికి ఫోన్ చేసి..  కాన్ఫరెన్స్‌లో పెట్టి ఓ మంత్రి సోదరుడితోనూ, మంత్రి పీఏతోనూ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జైల్లో ముద్దాయిలకు ఫోన్ మాట్లాడుకునే సౌకర్యాన్ని అధికారులు కల్పిస్తున్నారు.

    కానీ ఈయన ఆస్పత్రికి వచ్చిన సందర్భాల్లో సెల్‌ఫోన్లు మాట్లాడటమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. పైగా ఆస్పత్రి సిబ్బందితో కూడా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత తనకు బాగా క్లోజ్ అని..  మీకేమైనా పనులు కావాలంటే చెప్పండి అని అంటున్నట్టు తెలుస్తోంది.
     
    ఖాకీల రాచమర్యాదలు
    ఓంప్రకాష్‌కు జైలు అధికారులు, పోలీసులు సైతం రాచమర్యాదలు చేయడం వివాదాస్పదమవుతోంది. గత మూడు నాలుగు నెలలుగా ప్రతి బుధ, శనివారాల్లో అతన్ని డయాలసిస్ కోసం అడవివరం జైలు నుంచి కేజీహెచ్‌కు తీసుకువస్తున్న సిబ్బంది.. కనీస నిబంధనలు, భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  ఈ క్రమంలోనే బుధవారం ఉదయం కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా ముద్దాయిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ రక్షణగా వచ్చారు.
     
    వచ్చిన పోలీసులు కూడా యూనిఫారంలో కాకుండా సివిల్‌డ్రస్‌లోనే ఉండటం గమనార్హం. సెక్యూరిటీగా వచ్చిన ఆ ఒక్క  కానిస్టేబుల్ వద్ద కూడా  ఎటువంటి ఆయుధాలు లేవు. ఇక బుధవారం కేజీహెచ్‌కు వ్యాన్‌లోనే తీసుకువచ్చిన పోలీసులు గతంలో పలుమార్లు ఓపెన్ జీపులో తీసుకువచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చినప్పుడు ఇలా నిబంధనలకు విరుద్ధంగా స్వేచ్ఛ కల్పిస్తున్న తీరు చూస్తుంటే..  జైలులో ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నరో  అర్ధం చేసుకోవచ్చు.
     
    ఏం జరిగిందో తెలుసుకుంటాం
    సరైన భద్రత లేకుండా.. ఎటువంటి నిబంధనలు పాటించకుండా ముద్దాయి ఓంప్రకాష్‌ను కేజీహెచ్‌కు తీసుకురావడం తప్పేనని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ సాక్షి ప్రతినిధికి చెప్పారు. అలా ఎందుకు జరిగిందో తెలుసుకుంటామన్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుకునే సౌకర్యాన్ని జైల్లోనే కల్పిస్తున్నాం. ఆస్పత్రిలో సెల్‌ఫోన్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇక మా సంరక్షణలో ఉన్న ముద్దాయిని జైలు నుంచి ఆస్పత్రికి తీసుకువెళ్లే బాధ్యత ఏఆర్ పోలీసులదేనని, బుధవారం ఎవరు వెళ్లారు.. ఏం చేశారో తనకు తెలియదని, విచారిస్తానని చెప్పారు.            
     
    మఫ్టీలో ఎస్కార్ట్ తప్పే.. కానీ..
    జైలు శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిని ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు ఏఆర్ పోలీసులే ఎస్కార్ట్‌గా వెళ్తుంటారని ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ కష్ణ చెప్పారు. కానీ బుధవారం ఓంప్రకాష్‌కు సెక్యూరిటీ ఇమ్మని తమను ఎవరూ అడగలేదు.. ఆ విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అయితే, ఇలాంటి కేసుల్లో పోలీసులు యూనిఫారంలో కాకుండా మఫ్టీలో ఉండటం తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు