వీరయోధునికి ఘన నివాళి

16 Jan, 2014 05:42 IST|Sakshi

యాదగిరి, న్యూస్‌లైన్ : గుల్బర్గాలో ఈనెల 8న జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ మున్నాను మట్టి కరిపించి.. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ మల్లికార్జున బండె కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌లో ఎస్‌ఐ మల్లికార్జున బండెతో పాటు ఇద్దరు ఏఎస్‌ఐలు తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. తలలోకి తుపాకీ గుళ్లు దూసుకుపోవడంతో కోమాలోకి వెళ్లిన మల్లికార్జున బండెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ప్రార్థనలు చేశారు. అయితే మంగళవారం రాత్రి ఆయన మరణ వార్త వెలువడిన వెంటనే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బుధవారం గుల్బర్గాలో అప్రకటిత బంద్ వాతావరణం ఏర్పడింది.

 యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు బంద్ చేసి.. బండె మృతికి సంతాపం సూచించారు. హైదరాబాద్-కర్ణాటకలో బీదర్ నుంచి మొదలుకుని గుల్బర్గా, యాదగిరి, రాయచూరుతో పాటు అన్ని చోట్ల పలువురు ప్రముఖులు, సంఘ సంస్థల నుంచి బండె వీర మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా గుల్బర్గా నగరంతో పాటు ఆళంద, జేవర్గి పట్టణాల్లో  బుధ, గురువారాల్లో  144 సెక్షన్‌ను  అమలు చేస్తూ గుల్బర్గా ఉపవిభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 కాగా  బండెకు సకాలంలో వైద్య చికిత్సలు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ  అభిమానులు, కన్నడ సంఘాల కార్యకర్తలు బుధవారం గుల్బర్గాలో టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. నగరంలోని శాస్త్రి సర్కిల్‌లో గుమికూడిన అభిమానులు గుల్బర్గా ఎస్పీ అమిత్‌సింగ్‌ను ఘెరావ్ చేసి మల్లికార్జున బండె భౌతికకాయాన్ని సత్వరం తెప్పించాలని డిమాండ్ చేశారు.  

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా