నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోకరా!

5 Oct, 2016 14:18 IST|Sakshi
నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోకరా!
  పెబ్బేరు ఆంధ్రాబ్యాంక్‌లో రుణం ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు
  చివర్లో అనుమానం వచ్చి నగల పరిశీలన
  నకిలీవిగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు
 
పెబ్బేరు: మండలకేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ (శ్రీరంగాపూర్ బ్రాంచ్)లో నకిలీ బంగారు నగలతో రుణం పొందేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా, చివరి నిమిషంలో బ్యాంక్ అధికారులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పెబ్బేరు మండలం నాగసానిపల్లికి చెందిన మోహన్‌రెడ్డి మంగళవారం బంగారు నగలపై పంట రుణం పొందేందుకు స్థానిక ఆంధ్రాబ్యాంక్(శ్రీరంగాపూర్ బ్రాంచ్)కు వచ్చాడు. ఈ మేరకు బ్యాంక్ అధికారులు సంబంధిత వ్యక్తి వద్ద వివరాలతో పాటు, పట్టదారు పాసుపుస్తకాలు, బంగారు అభరణాలు తీసుకుని డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మోహన్‌రెడ్డి తెచ్చిన బంగారు ఆభరణాలకు రూ.2 లక్షలు పంట రుణం ఇచ్చేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు. చివరి నిమిషంలో తాను తెచ్చిన బంగారు ఆభరణాలు తనవి కావని, తనకు పరిచయం ఉన్న వ్యక్తివని సంబంధం లేకుండా చెప్పడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. చివరి నిమిషంలో బ్యాంక్ మేనేజర్ గోవిందు బంగారు ఆభరణాలను మరోసారి పరిశీలించాలని సిబ్బందికి చెప్పడంతో ఆభరణాలను యాసిడ్‌తో పరిశీలించగా నకిలీవని తేలడంతో వారు అవాక్కయ్యారు. దీంతో తేరుకున్న బ్యాంక్ అధికారులు వెంటనే రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మోహన్‌రెడ్డిని నిలదీయగా తనకేం తెలియదని తనతో వచ్చిన మరో వ్యక్తిని చూయించాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ వారిద్దరిని పొలీసులకు అప్పజెప్పి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు.
 
అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన సోలీపూర్ రాములు రెండు రోజుల క్రితం మద్యం దుకాణంలో మందు  తాగుతూ నాగసానిపల్లికి చెందిన మోహన్‌రెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. తన కూతురి వివాహం ఉందని, తనవద్ద ఉన్న బంగారు నగలతో పంట రుణం పేరుతో తక్కువ వడ్డీతో రుణాన్ని ఇప్పించాలని కోరాడు. దీనికి అంగీకరించిన మోహన్‌రెడ్డి మంగళవారం పెబ్బేరు ఆంధ్రాబ్యాంక్ వద్ద కలసుకున్నారు. సోలీపూర్ రాములు మరో మహిళ ఇద్దరు కలిసి బంగారు నగలను మోహన్‌రెడ్డికి ఇచ్చి రుణం ఇప్పించాలని కోరడంతో తన పట్టదారు పాస్‌పుస్తకాలతో రుణం కోసం దరఖాస్తు చేశాడు. చివరి నిమిషంలో బ్యాంక్ అధికారులకు అనుమానం రావడంతో సదరు మహిళలు అక్కడి నుంచి జారుకుంది. దీంతో బ్యాంక్ అధికారులు మోహన్‌రెడ్డి, సోలీపూర్ రాములును పోలీసులకు అప్పగించి, జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంక్ మేనేజర్ గోవిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
 
 
మరిన్ని వార్తలు