మంటగలిసిన మానవత్వం

30 Mar, 2020 07:07 IST|Sakshi
మృతదేహాన్ని జేసీబీలో తీసుకెళ్తున్న దృశ్యం

అనారోగ్యంతో వ్యక్తి మృతి

అంత్యక్రియలకు రాని ఇద్దరు భార్యలు

మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు

కర్ణాటక, కోలారు:  ఆయనకు ఇద్దరు భార్యలు. ఆరోగ్యంగా ఉన్నంత కాలం వారిని పోషించాడు. అయితే ఆయన అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు కూడా చేయకుండా ముఖం చాటేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించి ఆయనకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈఘటన తాలూకాలోని జన్నఘట్ట గ్రామంలో చోటు చేసుకుంది. కుడవనహళ్లి గ్రామానికి చెందిన మునివెంకటప్ప (65) గరుడనహళ్లికి  చెందిన నారాయణమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది.

అనంతరం మునివెంకటప్ప మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల మునివెంకటప్ప ఆస్తమాకు గురి కావడంతో మునివెంకటమ్మనే జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయించేది. ఆదివారం చికిత్స అనంతరం ఆటోలో మొదటి భార్య నివాసం ఉంటున్న ఊరటి ఆగ్రహారకు తీసుకెళ్తుండగా మునివెంకటప్ప మార్గం మధ్యలోనే మరణించాడు.అప్పటికే అక్కడకు చేరుకున్నమొదటి భార్య, రెండో భార్య కలిసి మునివెంకటప్ప మృతదేహాన్ని నీలగిరితోపులో ఉంచి వెళ్లిపోయారు. సుగటూరు పోలీసులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అంత్యక్రియలు చేయడానికి రావాలని మునివెంకట్ప మొదటి భార్యకు పోలీసులు సూచించగా ఆమె రాలేదు. దీంతో పోలీసులు జేసీబీలో మృతదేహాన్ని తీసుకెళ్లి  జన్నఘట్ట చెరువులో ఖననం చేశారు.

మరిన్ని వార్తలు