కండక్టర్ చేతివేళ్లు కొరికినందుకు ఏడేళ్ల జైలు

14 Oct, 2016 17:52 IST|Sakshi

బెంగళూరు: టికెట్ కోసం జరిగిన గొడవలో కేఎస్ ఆర్టీసీ బస్సు కండక్టర్ చేతివేళ్లను కొరికిన ప్రయాణికుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోటె జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మహాలింగాపుర తాలూకా కంగేరిమడ్డికి చెందిన నాగేష్ బసప్ప 2009లో తన కుమారుడితో కలిసి కోల్హాపురకు వెళ్లడానికి బాగల్‌కోటెలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అప్పట్లో కండక్టర్‌గా ఉన్న ముధోల్ డిపోకు చెందిన రాజీసాబ్ నబిసాబ.. నాగేష్ బసప్ప కుమారుడికి పది రూపాయల హాఫ్ టికెట్ తీసుకోవాలని సూచించాడు.

చిన్న పిల్లవాడని, టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని అతను వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో కోపోద్రిక్తుడై కండక్టర్ చూపుడు వేలును కొరికాడు. దీంతో కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా కండక్టర్‌ను గాయపరిచారని తేలడంతో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు నాగేష్ బసప్పకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. కాగా.. అప్పట్లో కేఎస్ ఆర్టీసీ కండక్టర్‌గా ఉన్న రాజీసాబ్ ప్రస్తుతం ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో పని చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు