ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పరిచయం.!

10 May, 2017 08:45 IST|Sakshi
ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పరిచయం.!

► ప్రియుడు అరెస్టు
► వివాహేతర సంబంధమే కారణం

టీనగర్‌(చెన్నై): వివాహేతర సంబంధం కారణంగా మహిళా టీచర్‌ను ప్రియుడు కారు ఎక్కించి హతమార్చాడు. దీంతో పోలీసులు అతనిని, మరో వ్యక్తిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పొల్లాచ్చి సమీపంలోని కినత్తుకడవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది నివేదా. ఈమె భర్త రఘు. వీరికి కుమార్తె ఉంది. 20 ఏళ్ల క్రితం దంపతుల మధ్య అభిప్రాయభేదాలు రాడంతో నివేదా విడాకులు తీసుకుని కుమార్తెతో నివసిస్తోంది.

అదే ప్రాంతంలో అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఇళయరాజా(28)తో నివేదాకు ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలావుండగా ఏడాది క్రితం నివేదా కుమార్తెకు చెన్నై సమీపంలోని మరైమలైనగర్‌లో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి  చేరుకుంది. నివేదా ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా చెన్నై కొలత్తూర్‌ వజ్రవేలునగర్‌కు చెందిన గణపతి(33) నివేదాకు పరిచయమయ్యాడు. వివాహితుడైన గణపతి ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు.

ఇరువురి మధ్య స్నేహం పెరిగింది. దీంతో బ్యాంకులో లోన్‌ తీసిస్తానని నివేదాకు తెలిపాడు. ఆదివారం నివేదా, ఇళయరాజా కోయంబత్తూరు నుంచి కారులో చెన్నైకు వెళుతుండాగా మార్గమధ్యంలో మరైమలైనగర్‌లో కుమార్తెను చూసి అన్నానగర్‌కు బయలుదేరారు. న్యూ ఆవడి రోడ్డు వేలంగాడు స్మశానవాటిక సమీపాన వస్తుండగా గణపతి వద్ద తన ఫోటో ఉందని, దాన్ని తీసుకోవాలని, అందుకే అతన్ని రమ్మన్నానని ఇళయరాజాకు తెలిపింది. అక్కడికి వచ్చిన గణపతి, నివేదా తో కలిసి కొద్ది దూరంలో నిలబడి మాట్లాడసాగారు.

వారిద్దరూ సన్నిహితంగా ఉండడం కారులో నుంచి గమనిస్తున్న ఇళయరాజా కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే కారును వేగంగా నడిపి ఇద్దరిని ఢీకొట్టాడు. గణపతి తప్పించుకున్నాడు. ఇందులో నివేదా కాలు విరిగింది. తర్వాత ఏమీ తెలియనట్లు నివేదాను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. వెంట గణపతి కూడా వచ్చాడు. పరీక్షించిన వైద్యులు నివేదా మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న అన్నానగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం కేసుగా నమోదు చేసుకున్నారు.

అయితే ఘటనపై వారికి అనుమానం రావడంతో అన్నానగర్‌ శాంతి భద్రతల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్‌ శరవణన్‌ కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి విచారణ జరిపారు. ఇళయరాజా, గణపతిల వద్ద విడివిడిగా విచారణ జరిపారు. నివేదాపై కారు ఎక్కించి హత్య చేసినట్లు ఇళయరాజా ఒప్పుకోవ డంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇళయరాజా వాంగ్మూలం: ఇళయరాజా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నివేదా పక్కింట్లో నివసించేవాడినని, ఆరేళ్లపాటు ఆమెతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిపాడు. ఆమెకు గణపతితో సంబంధం ఉండడం తనకు ఆగ్రహం తెప్పించిందని, దీంతో సహించలేక ఇరువురిపై కారు ఎక్కించి హతమార్చేందుకు ప్రయత్నించాన్నాడు. గణపతి మాట్లాడుతూ తనకు ఫేస్‌బుక్‌లో నివేదా పరిచయమైందని, ఆ తర్వాతనే ఆమె భర్తను విడిచి జీవిస్తున్నట్లు తెలిసిందన్నాడు. ఆమెతో తాను కూడా ఒంటరిగా జీవిస్తున్నానని, వివాహం చేసుకుంటానని చెప్పానన్నాడు. ఆమె కోసం లోన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలపడంతో దాన్ని నమ్మిన తనకు నగదు అందజేసిందన్నాడు.

మరిన్ని వార్తలు