భార్యా పిల్లలు ఇబ్బంది పడకూడదని..

3 May, 2017 09:01 IST|Sakshi
భార్యా పిల్లలు ఇబ్బంది పడకూడదని..

► భార్య, ఇద్దరు పిల్లలను కడతేర్చి భర్త ఆత్మహత్య       
► శ్రీరంగంలో కలకలం

నమ్మిన వాళ్లు మోసం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హతమార్చి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుచ్చి శ్రీరంగంలో ఈ ఘటన మంగళవారం కలకలం రేపింది.

సాక్షి, చెన్నై: తిరుచ్చి శ్రీరంగం సింగ పెరుమాళ్‌ ఆలయ వీధికి చెందిన విశ్వనాథన్‌(35) తిరువాడనైలో చెప్పుల దుకాణం నడుపుతున్నాడు. స్థానికంగా అన్నాడీఎంకే నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇతని భార్య దేవానై(34), కుమారుడు గుణశేఖర్‌(7), కుమార్తె నిషాంతిని(2). ఇరుగుపొరుగు వారితో ఈ కుటుంబం సన్నిహితంగా బంధువులు, ఆప్తుల వలే కలిసిమెలిసి ఉండేవారు.  మంగళవారం ఉదయం ఎంతకు విశ్వానాథన్‌ ఇంటి తలుపు తెరచుకోలేదు.

ఇరుగుపొరుగు వారు పదేపదే తలుపు తట్టినా స్పందన లేదు. ఆందోళనతో తలుపుల్ని పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా, అక్కడ కనిపించిన దృశ్యాలు ఆ పరిసరాల్లో విషాదం  నింపాయి. ఆనందంగా ఉండే కుటుంబంలో ఏమి జరిగిందోనన్న ఆవేదన వ్యక్తం చేసే వాళ్లే అధికం. దీనిపై సమాచారం అందుకున్న విశ్వనాథన్, దేవానై బంధువర్గం పరుగులు తీశారు. పోలీసులు రంగంలోకి దిగి, మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగం పెంచారు.

కాటేసిన మోసం: విశ్వనాథన్‌ బంధువులు, సన్నిహితుల వద్ద సాగిన విచారణతో ఓ మహిళ, ఆమె కుటుంబం మోసం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన షాపునకు తరచూ వచ్చే భరత నాట్య మాస్టర్‌ సంగీత అనే మహిళతో విశ్వనాథన్‌కు పరిచయం ఏర్పడింది. విదేశీయులు శ్రీరంగంకు అధికంగా వస్తుండడం వల్ల  వారి కోసం ప్రత్యేకంగా ఓ డ్యాన్స్‌ స్కూల్‌ ఏర్పాటు, నృత్య ప్రదర్శనలకు వేదిక సిద్ధం చేద్దామని సంగీత విశ్వనాథన్‌కు ఆశ చూపింది.

ఆమె మాటల్ని నమ్మి తన వద్ద ఉన్న సొమ్ముతో పాటు, సన్నిహితుల వద్ద అప్పుగా సేకరించిన మొత్తాన్ని పెట్టుబడిగా సంగీత చేతికి విశ్వానాథన్‌ అప్పగించాడు. అనంతరం ఏడాది గడిచినా, డ్యాన్స్‌ స్కూల్‌ షెడ్డుకే పరిమితం కావడంతో సంగీత, ఆమె తండ్రి, సోదరిని నిలదీశాడు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళనలో పడ్డాడు. తన వద్ద ఉన్న సొమ్ము పోవడం, స్నేహితులకు చెల్లించాల్సిన అప్పుల భారం మొత్తం కోటి రూపాయలకు చేరడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ఈ సమాచారం తెలుసుకున్న సన్నిహితులు పలువురు సంగీత కుటుంబాన్ని ప్రశ్నించినా ఫలితం శూన్యం. చివరకు బెదిరింపులు ఇవ్వడంతో రూ.30 లక్షలు మాత్రమే ఇచ్చి, ప్రస్తుతం తాను ఇవ్వలేని స్థితిలో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో అప్పుల భారంతో సతమతం కావడం కన్నా, బలవన్మరణం నిర్ణయానికి విశ్వనాథన్‌ వచ్చినట్టున్నాడు.

తన తర్వాత భార్య, పిల్లలకు ఇబ్బందులు తప్పవని భావించి నిద్రిస్తున్న భార్య, పిల్లలను గొంతు నులిమి హతమార్చి, తరువాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందంగా ఉన్న ఓ కుటుంబం మోసం కాటుకు బలి కావడాన్ని ఆ పరిసర వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమాచారం తెలుసుకుని సంగీత కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం గాలింపు సాగుతోంది.

మరిన్ని వార్తలు