ఎస్‌యూవీ కారు అమ్మి, క‌రోనా బాధితుల కోసం..

24 Jun, 2020 14:57 IST|Sakshi

ముంబై: క‌ళ్ల ముందే ఫ్రెండ్‌ సోద‌రి ప్రాణాలు కోల్పోయింది. బ‌తికించుకునే ఆర్థిక స్థోమ‌త ఉన్నా ఆసుప‌త్రుల్లో వైద్య ప‌రిక‌రాల కొర‌త, ప‌డ‌క‌లు ఖాళీగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఆమె క‌డుపులో బిడ్డ‌తో స‌హా మ‌ర‌ణించాల్సి వ‌చ్చింది. ఇది చూసిన ముంబైకి చెందిన షెహ‌‌న‌వాజ్ మ‌న‌సు చ‌లించిపోయింది. క‌నీసం ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ఉన్నా ఆమె బ‌తికి ఉండేద‌ని ఓ వైద్యుడు చెప్ప‌డంతో అత‌ను మ‌రింత బాధ‌ప‌డ్డాడు. అదే స‌మ‌యంలో అత‌ని మ‌న‌సులో ప‌దిమందికి సాయం చేయాల‌నే ఆలోచ‌న పునాది పోసుకుంది. ఆ మ‌హిళ‌లాగా ఎవ‌రూ చ‌నిపోవ‌డానికి వీల్లేదంటూ త‌నకు చేత‌నైన సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. (మృతదేహాలకు కరోనా పరీక్షలు బంద్‌)

క‌రోనా బారిన ప‌డ్డ ప‌త్రి ఒక్క‌రికీ ఆసుప‌త్రిలో బెడ్డు దొర‌క‌ని ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందే. అటు ఆసుప‌త్రుల‌నూ వెంటిలేట‌ర్లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త వెంటాడుతోంది. ఈ క్ర‌మంలో ఇంట్లో స్వీయ నిర్బంధం విధించు‌కుంటున్న కోవిడ్ పేషెంట్ల‌కు సాయం చేసేందుకు షెహ‌నవాజ్ త‌నకు ఎంతో ఇష్ట‌మైన‌ ఎస్‌యూవీ(స్పోర్ట్‌ యుటిలిటీ వెహిక‌ల్‌) కారును అమ్మేశాడు. ఆ డ‌బ్బుతో 60 సిలిండ‌ర్ల‌ను కొని మ‌రో 40 సిలిండ‌ర్ల‌ను అద్దెకు తీసుకున్నాడు. వీటిని స‌కాలంలో కోవిడ్ బాధితుల‌కు అంద‌జేసి ప్రాణ‌దాత‌గా మారాడు. అలా సుమారు 300 మందికి సాయం చేశాడు. కాగా షెహ‌న‌వాజ్‌ త‌న మిత్రుడు అబ్బాస్ రిజ్వీతో కలిసి ఓ ఎన్జీవో న‌డిపిస్తున్నాడు. సాయం కోసం ఎన్జీవో త‌లుపు త‌ట్టిన‌వారికి తామున్నామంటూ అండ‌గా నిల‌బ‌డుతున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో వీరు చేస్తున్న ప‌ని ఇత‌రుల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా మారింది. (తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం)

మరిన్ని వార్తలు