రూ. 2000 నోటును కలర్ జిరాక్స్ తీసి...

12 Dec, 2016 14:52 IST|Sakshi
రూ. 2000 నోటును కలర్ జిరాక్స్ తీసి...
ముంబై: ఒక పక్క జనం కొత్త నోట్ల కోసం నానా తిప్పలు పడుతుంటే మరోపక్క కలర్ జిరాక్స్ చేసిన నోట్లు ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జిరాక్స్ తీసిన రూ.2,000 నోటును మద్యం షాపులో ఇచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నగర శివారు ప్రాంతమైన విరార్‌లో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. విరార్ ప్రాంతానికి చెందిన తుషార్ చికలే (26) అంధేరిలోని ఓ నోటరీ వకీలు కార్యాలయంలో పని చేస్తున్నాడు.
 
సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు కార్యాలయంలో ఉన్న జిరాక్స్ మెషన్‌లో కొత్తగా వచ్చిన రూ.2,000 నోటును ఇరువైపులా కలర్ జిరాక్స్ తీశాడు. అనుమానం రాకుండా రెండు ముక్కలను ఒక్కటిగా అతికించాడు. విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రాజా వైన్స్ వద్ద విపరీతంగా రద్దీ ఉంది. ఇదే అదనుగా కలర్ జిరాక్స్ చేసిన రెండు వేల నోటును వైన్ షాపు సిబ్బందికి అందజేసి ఓ బీరు కావాలని అడిగాడు. కాని, ఆ నోటు చేతితో పట్టుకున్న సిబ్బంది అది నకిలీదని వెంటనే గ్రహించడంతో విషయం బయటపడింది. దీంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తుషార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా