మండీహౌస్‌లోనూ నాలుగు ఫ్లాట్‌ఫాంలు

14 Dec, 2013 22:35 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో ఇంటర్‌చేంజ్ స్టేషన్‌గా మారబోతున్న మండీహౌస్ మెట్రోస్టేషన్‌లో నాలుగు ఫ్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజీవ్‌చౌక్, కశ్మీరీగేట్, ఇంద్రలోక్ ఇంటర్‌చే ంజ్ స్టేషన్ల మాదిరిగా ప్రయాణికులు లైన్లు మారేందుకు మెట్లు ఎక్కిదిగాల్సిన పనిలేదు.  సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ మాదిరిగానే ఈ స్టేషన్‌లోనూ సమాంతరంగా నాలుగు లైన్లను నిర్మిస్తున్నారు. కేంద్రీయ సచివాలయ్  మెట్రో స్టేషన్‌లో బదర్‌పూర్‌నుంచి వచ్చే ప్రయాణికులు, ఐఎన్‌ఏ లేదా రాజీవ్‌చౌక్ వైపు వెళ్లే ప్రయాణికులు కేవలం ఒకేసారి మెట్లు దిగితే సరిపోతుంది. అదేవిధంగా మండీహౌస్ మెట్రోస్టేషన్‌లోనూ నిర్మాణ పనులను సంబంధిత అధికారులు వేగవంతం చేశారు. దీనిలో ఒకే వరుసలో నాలుగు లైన్లు పక్కపక్కన ఉంటాయి. ఈ విధానంతో రద్దీ ఎక్కువగా ఉన్నా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారివారి స్టేషన్లకు వె ళ్లే వీలుంటుంది.
 
 బదర్‌పురా-ఫరీదాబాద్ వెళ్లే వీలు:
 డీఎంఆర్‌సీ చేపట్టిన మండీహౌస్ స్టేషన్ ఇంటర్‌చేంజ్ స్టేషన్ పూర్తయితే ప్రయాణికులు నేరుగా బదర్‌పురా-ఫరీదాబాద్ వెళ్లే వీలుంటుంది. అదే విధంగా నోయిడా-వైశాలి నుంచి ఐటీఓ లేదంటే షాద్రా నుంచి ఐటీఓ, లాల్‌కిల్లా నుంచి వచ్చేవారు సైతం త్వరగా వెళ్లే వీలుంటుంది. కాగా అధికారిక సమాచారం ప్రకారం కేంద్రీయ సచివాలయం నుంచి మండీహౌస్ మధ్య లైన్ 2014 మార్చినాటికి అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌పై దాదాపు లక్షన్నరమంది ప్రయాణికుల భారం తగ్గుతుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వైపులకు వెళ్లేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయి.
 
మరిన్ని వార్తలు