భారీగా రైళ్ల రద్దు....

16 Nov, 2013 01:18 IST|Sakshi

సాక్షి, ముంబై: గోటీ-ఇగత్‌పురి రైల్వే స్టేషన్ల మధ్య మంగళ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం పట్టాలు తప్పి ముగ్గురు మరణించిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. రద్దు చేసిన రైళ్లలో అప్, డౌన్ ఎల్‌టీటీ-మన్మాడ్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్, అప్, డౌన్ సీఎస్టీ-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్, అప్, డౌన్ సీఎస్టీ-బుసావల్ ప్యాసింజర్ రైళ్లతోపాటు నాందేడ్-సీఎస్జీ తపోవన్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. మరోవైపు సీఎస్టీ నుంచి నాందేడ్‌కు బయలుదేరిన తపోవన్ ఎక్స్‌ప్రెస్‌ను కళ్యాణ్ వద్ద నిలిపివేశారు.
 
 12 రైళ్ల మళ్లింపు...
 మంగళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాల తప్పిన అనంతరం ఇగత్‌పురి-గోటీ రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని పుణే, దౌండ్, మన్మాడ్ మీదుగా నడిపించారు. అప్, డౌన్ మార్గాల్లో నడిచే మొత్తం 12 రైళ్లను పుణే, దౌండ్ మీదుగా నడిపించారు.


 నాలుగు నెలల్లో రెండో ఘటన...
 ఇగత్‌పురి రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు నెలలు తిరగకుండానే మరో ఘటన జరిగింది. ఇదే సంవత్సరం జూలై ఐదున సికింద్రాబాద్-దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఇగత్‌పురి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సఘటన జరగడం, వేగం కూడా తక్కువగా ఉన్నందున ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు కాకముందే మంగళ ఎక్స్‌ప్రెస్ కూడా శుక్రవారం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంత వరకు తెలియరాలేదు.  
 
 ప్రత్యేక రైళ్లో ప్రయాణికుల తరలింపు
 ఘటనాస్థలంలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైళ్లో ఎర్నాకుళంకు పంపించారు. సెంట్రల్ రైల్వే పీఆర్‌ఓ ఎకె సింగ్ అందించిన వివరాల మేరకు సుమారు 450 ప్రయాణికులను 10 బస్సుల ద్వారా ముందుగా ఇగత్‌పురి రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఓ ప్రత్యేక రైళ్లో మధ్యాహ్నం 12.30 గంటలకు గమ్యస్థానాలకు పంపించారు.  
 
 మృతులు, గాయపడిన వారి వివరాలు..
 మృతుల్లో హర్యానా పథోడాకు చెందిన సత్యబీర్ సింగ్ (40), ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌వాసి రాజు కుషువా (34) ఉన్నారు. మూడో వ్యక్తి వివరాలు తెలియరాలేదు.
 
 గాయపడినవారు..
 మహిళలుః  కమలా రమణి (70), మాధవి భైరన్ (28), సిమ్రన్ రమానీ (35),అశ్వినీ పురగావ్‌కర్ (50), రింకూశర్మ (25), సుని తా రాథోడ్ (28), నేహా రమానీ (19) ఉన్నారు.
 
 చిన్నారులు (బాలికలు)ః శుభి రాథోడ్ (1.5 ఏళ్లు), రియా రమానీ (రెండున్నరేళ్లు).
 
 పురుషులుః ముర ళీధర్ (60), రాహుల్ రమానీ (10), తెక్‌సింగ్ (60), సూరజ్ గౌతమ్ (30), సూర్తాజ్ కుమార్ (38), ఉత్తమ్‌చంద్ ఖండేల్‌వాల్ (40), రాజేష్‌కుమార్ (25), పురుషోత్తం బన్వారీ (54), కుమార్ బన్వారీ (44), రామ్ రమానీ (38), ప్రకాష్ రమానీ (35) ఉన్నారు. మిగతా ఆరుగురి వివరాలు అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు