నో సెల్ఫీ ప్లీజ్..

29 Aug, 2016 02:24 IST|Sakshi
నో సెల్ఫీ ప్లీజ్..

ప్రణాళికలు రచిస్తున్న మంగళూరు జిల్లా యంత్రాంగం


మంగళూరు: అత్యాధునిక సాంకేతికతతో కూడిన సెల్‌ఫోన్లు తక్కువ ధరలకే మార్కెట్‌లో సందడి చేస్తుండడంతో ఎక్కడ చూసినా సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు  సెల్ఫీ క్రేజుకు దాసోహమయ్యారు. ఎత్తై కొండలు, లోతైన జలపాతాలు తదితర ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ చాలా మంది యువతీ, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన సెల్ఫీ జాడ్యం  కొద్ది కాలంగా భారత్‌కు కూడా వ్యాపించింది.  2015లో ప్రపంచ వ్యాప్తంగా 27 మంది సెల్ఫీ క్రేజులో పడి మృతి చెందగా అందులో 15 మంది భారతీయులు ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు అందించింది.


కాగా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఇటీవల కొంత మంది యువతీ, యువకులు మృతి చెందడంతో పర్యాటక , ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.  ఇదే దిశలో మంగళూరు అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు.  రాష్ట్ర పర్యాటకంలో అగ్రస్థానంలో ఉన్న మంగళూరు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాను నోసెల్ఫీజోన్లుగా ప్రకటించడానికి రాష్ట్ర నిర్ణయం తీసుకోనుందని సమాచారం. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన సోమోశ్వర రుద్రపాద, సుల్తాన్ బత్తేరి కోట, రైల్వేస్టేషన్, నేత్రావతి బ్రిడ్జ్, మరవూరు డ్యామ్, తణ్ణీరు బావి, పణంబూరు, ఉళ్లాల తదితర ప్రాంతాలను సెల్ఫీలను నిషేధించనుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు