ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు

12 Dec, 2017 07:55 IST|Sakshi

విస్తరణకు సర్కారు నిర్ణయం

కేంద్రం, రాష్ట్రం సగం, సగం నిధులు

కేబినెట్‌ భేటీలో ఆమోదం

ఊహించినట్లుగానే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌కు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోక్షం లభించింది. పథకం సాకారమైతే 30 కిలోమీటర్ల ట్రాఫిక్‌ కష్టాల నుంచి నగరవాసులకు విముక్తి లభిస్తుంది. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు.

సాక్షి, బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సోమవారం విధానసౌధలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మిస్తామన్నారు. సుమారు 30 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గం నిర్మాణానికి పూర్తి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను తయారు చేయాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటాయన్నారు. కేంద్రం వాటా సుమారుగా రూ.6 వేల కోట్లు వరకూ ఉంటుందని, ఈ మేరకు ఇప్పటికే కేంద్రానికి నివేదిక అందించామన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణం వల్ల బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య కొంతవరకూ పరిష్కారమవుతుందని తెలిపారు.

కేబినెట్‌ భేటీ నిర్ణయాల్లో ముఖ్యమైనవి ఇలా...
స్మార్ట్‌ సిటీ పథకంలో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు భాగంగా స్మార్ట్‌సిటీ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుకు అనుమతి.
రాష్ట్రంలో అగ్రికల్‌ జోన్‌ల ఏర్పాటుకు అనుమతి
విక్టోరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 కోట్లు విడుదల
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదలుకొని జిల్లా ఆసుపత్రుల వరకూ ఆప్తాల్మాలజీ (కంటి విభాగం) ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.06 కోట్లు విడుదల.
రాష్ట్రంలో 500 గ్రామపంచాయతీల్లో వై–ఫై ఏర్పాటుకు అంగీకారం.
మురుగునీటిని సంస్కరించి పునఃవినియోగానికి వీలుగా ప్రత్యేక పాలసీని రూపొందించడానికి అంగీకారం.
రూ.200 కోట్లతో చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో పశ్చిమవాహిని అనే పథకం అమలు.

మరిన్ని వార్తలు