శివకాశీలో భారీ అగ్నిప్రమాదం

21 Oct, 2016 01:12 IST|Sakshi
శివకాశీలో భారీ అగ్నిప్రమాదం

9 మంది మృతి.. 20 మందికి తీవ్రగాయాలు
బాణసంచా గిడ్డంగిలో పేలుళ్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని శివకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా గిడ్డంగి వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పక్కనున్న స్కాన్‌సెంటర్‌కు దట్టమైన పొగలు వ్యాపించటంతో తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. 20మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. శివకాశీ బైపాస్ రోడ్డులోని ప్రయివేటు బాణసంచా గిడ్డంగి వద్ద ఈ ఘటన జరిగింది. రిటైల్ దుకాణాలకు సరుకు చేరవేసేందుకు గురువారం మధ్యాహ్నం 20 మంది కూలీలు బాణ సంచా బండిళ్లను రెండు వ్యాన్లలోకి సర్దుతున్నారు. ఇంతలోనే బండిళ్లలోని టపాసులు ఒకదానికి ఒకటి రాసుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని టపాసులు పేలి మంటలు గిడ్డంగి లోకి వ్యాపించటంతో ఎగసిపడ్డాయి.

స్కాన్ సెంటర్‌లోనే..: గిడ్డంగిలోనుంచి మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న దేవకీ స్కాన్ సెంటర్‌లోకి దట్టమైన పొగచూరుకుంది. ఆ సమయంలో సుమారు 30 మందికి పైగా రోగులు వైద్య పరీక్షల కోసం స్కాన్ సెంటర్‌కు వచ్చారు. హఠాత్తుగా దట్టమైన పొగ వారిని చుట్టుముట్టడంతో అందులో ఉన్న వారంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. కొందరు స్థానికులు.. స్కాన్ సెంటర్ వెనుకవైపు కిటికీని బద్దలు కొట్టి లోపల చిక్కుకున్న వారిలో కొందరిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే కొందరు దట్టమైన పొగకారణంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఊపిరాడకే చనిపోయారు: గిడ్డంగి సమీపంలో మంటలను మొదట్లోనే ఊహించిన బయటనున్న కూలీలు, స్థానికులు, పక్కనున్న దుకాణ దారులు పారిపోయారు. కానీ ప్రమాదాన్ని గుర్తించని స్కాన్‌సెంటర్లో కూర్చున్న వారు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అయితే మృతులంతా మంటల వల్ల చనిపోలేదని.. దట్టమైన పొగలతో ఊపిరాడకే మృతిచెందారని కలెక్టర్ శివజ్ఞానం తెలిపారు. గిడ్డంగి లోపలినుంచి బయటకెళ్లే ప్రయత్నంలో గాయపడిన కూలీలను శివకాశీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో 15 స్కూటర్లు, ఒక జీపు, బాణ సంచా తరలింపునకు సిద్ధం చేసుకుని ఉన్న రెండు మినీ వ్యాన్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖ దాదాపు గంటసేపు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చింది. బాణసంచా తయారీ గిడ్డంగి, దుకాణ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, మహారాష్ట్రలోని పుణే శివార్లలోని ఓ పత్తి ఫ్యాక్టరీలో గురువారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు