-

వీరి కాలిన గాయాలకు ‘చికిత్స’ లేదా?

12 Jul, 2017 18:56 IST|Sakshi


చెన్నై: గహ హింసను తట్టుకోలేక క్షణికావేశానికి గురై ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుందామన్న ప్రయత్నంలో కాలిన గాయాలతో జీవితాంతంత బాధపడుతూ బతికే భార్యలెందరో నేటి సమాజంలో! భర్తలే కిరోసిన్‌ పోసి భార్యను తగులబెట్టబోతే అదష్టవశాత్తు బతికి బట్టకట్టినా రేగిన గాయాలు రేపే బాధలను తట్టుకోలేక తల్లడిల్లే తరుణులెందరో! నైలాన్‌ చీరకట్టుకొని వంట చేస్తుంటే పొయ్యిలో నుంచి రేగిన నిప్పురవ్వలు లేదా గ్యాస్‌ స్టవ్‌ లీకేజీ వల్ల ఎగిసిన మంటలకు ఒళ్లంత కాలిపోతే తనువంతా పుండై బతుకును భారంగా గడిపే ఇల్లాళ్లు ఎందరో! 
 
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో ఏటా 70 లక్షల మంది మహిళలు మంటల్లో చిక్కుకుని గాయపడుతున్నారు. వారిలో దాదాపు 1.40 లక్షల మంది మరణిస్తున్నారు. ఏడు లక్షల మంది ఆస్పత్రుల్లో చే రుతున్నారు. ఒక్క చైన్నైలోని కిల్‌పాక్‌ వైద్య కళాశాల ఆస్పత్రి ప్రత్యేక విభాగంలో ఏటా మూడు వేల మంది కాలిన గాయాలతో చేరుతున్నారు. ఇలాంటి కేసుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది మహిళలు గహ హింస కారణంగానే మంటల్లో చిక్కుకుంటున్నారు. క్షణికావేశానికిలోనై వారంతట వారు ఆత్మహత్యలకు ప్రయత్నంచడం లేదా భర్త లేదా అత్తింటివారు కిరోసిన్‌పోసి తగులబెట్టడం వల్ల మంటల్లో చిక్కుకుంటున్నారు.  కానీ 90 శాతం కేసులు ప్రమాద కేసులుగానే నమోదవుతున్నాయి. అత్తింటివారిపై ఆత్మహత్యలకు ప్రోత్సహించారన్న కేసులు కూడా దాఖలు కావడం లేదు. 
 
ఇక గాయపడిన వారి మహిళల జీవితాలు చాలా దుర్భరం. చర్మం కాలిపోవడం వల్ల లోపలి అవయవాలు కూడా కాలిపోతాయి. కొన్ని కమిలిపోతాయి. నరాలు వంకర్లు పోతాయి. కొన్ని బిగుసుకుపోతాయి. ఫలితంగా శరీరంలో కొన్ని అవయవాలు పనిచేస్తాయి. కొన్ని అచేతనం అవుతాయి. మంటల వేడికి వంకర్లు తిరిగిపోయిన కాళ్లు, చేతులు, ముంచేతులు, మొకాళ్లు, మెడలు సరిగ్గా పనిచేయకపోవడమే కాకుండా చికిత్స తీసుకునేంతకాలం, చచ్చిన శవాల్లా మంచాలకు వివిధ భంగిమల్లో కరుచొని ఉండాల్సిన దుర్భర పరిస్థితి కూడా చాలా మందికే దాపురిస్తుంది. ఈ శారీరక నరకయాతనను అనుభవించడమే కాకుండా మానసికంగా అంతులోని ఆందోళనను, వ్యధను భరించాల్సి ఉంటుంది. 
 
పుట్టింటివారు, మెట్టింటివారే కాకుండా ఇరుగుపొరుగు వారు తనను ఎలా చూస్తారన్న ఆత్మన్యూన్యతా భావం, సమాజంలో తలెత్తుకొని ఎలా బతకాలి, ఎలా తిరగాలనే వారి ఆవేదన, ఆందోళనలకు అంతుండదు. ఆస్పత్రి నుంచి ఇల్లు చేరిన వారు వల్లకాడు చేరినట్లు, ఇంట్లోకి రానిచ్చేవారు లేక అనాథాశ్రయాల అరుగులు ఎక్కేవారి ఆక్రందనల గురించి ఎక్కువగా చెప్పలేం. ఇలా గహ హింస కారణంగానే ఒళ్లు కాల్చుకుంటున్న తల్లులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నది ఇప్పుడు వారిని వారి గాయాలకన్నా ఎక్కువగా తొలుస్తున్న ప్రశ్న. 

 
యాసిడ్‌ దాడులకు గురై అంగవికలురవుతున్న బాధితులను ‘పర్సనాలిటీ విత్‌ డిసేబుల్డ్‌ యాక్ట్‌’ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. దీనికోసం 1995 నాటి పీడబ్లూడీ చట్టంలో సవరణలు చేస్తూ కేంద్రం 2016లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం కింద అంగవికలురకు ఎలాంటి సదుపాయాలు వర్తిస్తాయో యాసిడ్‌ దాడికి గురైన వారికి అలాంటి సదుపాయాలు వర్తిస్తాయి. నిర్భయ చట్టం కింద కూడా యాసిడ్‌ బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. 2013లో క్రిమినల్‌ లా చట్టంలో తీసుకొచ్చిన సవరణల ప్రకారం 326ఏ, 326బీ సెక్షన్ల కింద యాసిడ్‌ దాడి కేసులను నాన్‌ బెయిలబుల్‌ నేరంగా పరిగణిస్తున్నారు. 
 
అలాగే ఇప్పుడు మంటల్లో చిక్కుకున్న బాధితులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వారిని ఆత్మహత్యలకు కారకులైన వారిపై హత్యాయత్నం కేసులు బనాయించాలని వారు కోరుతున్నారు. అత్తింటి వారి ఒత్తిళ్లకు లొంగి ప్రమాదవశాత్తు చీరంటుకొని గాయపడినట్లు నమోదవుతున్న కేసులను ఎప్పుడైనా తిరగతోడడానికి, బాధితులు ఎప్పుడైనా తమ వాంగ్మూలాన్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించాలని వారి తరఫున పలు ఎన్జీవో సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

 
మరిన్ని వార్తలు