నక్సల్స్ సంచారం

24 Aug, 2014 23:19 IST|Sakshi
నక్సల్స్ సంచారం

సాక్షి, చెన్నై : పశ్చిమ పర్వత శ్రేణుల్లో ఆయుధాలతో నక్సల్స్ సంచరిస్తున్నట్టుగా వచ్చిన సమాచారంతో అటు కేరళ, ఇటు రాష్ట్ర పోలీసు లు గాలింపులు తీవ్రతరం చేశారు. అయితే, ఎక్కడా అలాంటి జాడ కానరాలేదు. అదే సమయంలో వర్షాల పుణ్యమా అంటూ పురుగుల దాటికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. రాష్ట్రంలో నక్సల్స్‌కు ఆస్కారం లేదు. ఒకప్పుడు ఇక్కడ ఉన్నా, కట్టుదిట్టమైన చర్యలతో నక్సల్స్ పత్తా లేకుండా పోయారు. అయితే, ఈరోడ్ అడవులు, తేని నుంచి కేరళ వరకు విస్తరించి ఉన్న పశ్చిమ పర్వత శ్రేణుల్లో తరచూ గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తుం డడం, అధికారులు పరుగులు తీయడం పరి పాటే. ఆయుధాలతో తిరిగే వారు స్మగ్లర్లుగా ఉండొచ్చన్న భావన ఉంది. అయితే, అటవీ శాఖ చెక్ పోస్టులు పటిష్ట భద్రత నడుమ ఉన్న దృష్ట్యా, అటవీ సంపదను రాష్ట్రం నుంచి తరలించాలంటే చెమటోడ్చాల్సిందే.
 
 ఈ పరిస్థితుల్లో  శనివారం పశ్చిమ పర్వత శ్రేణుల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నట్టుగా వచ్చిన సమాచారంతో అటు కేరళ, ఇటు తమిళ పోలీసులు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆదివాసీ గ్రామాల్లో విచారించారు. గుర్తుతెలియని వ్యక్తులు సంచారం ఉన్నట్టు గిరిజనులు పేర్కొంటున్నా, ఆ వ్యక్తుల జాడ మాత్రం కానరాలేదు. తుపాకుల్ని చేత బట్టి మరీ సంచరిస్తున్న దృష్ట్యా, నక్సల్స్ అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దుల వరకు తనిఖీలు సాగినా, ఎవ్వరి జాడ కానరాలేదు. అదే సమయంలో ఆదివారం ఉదయం నుంచి తనిఖీల్లో ఉన్న సిబ్బంది అట్ట పురుగుల బెడద నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. రక్తాన్ని పీల్చే ఈ పురుగుల తాకిడి అధికం కావడంతో తమ గాలింపు ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
 

మరిన్ని వార్తలు