పోలీసులకు మ్యారేజ్‌ డే సెలవు

16 Jul, 2020 10:11 IST|Sakshi

విల్లుపురంలో శ్రీకారం

సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా మ్యారేజ్‌ డే సెలవు మంజూరు కానుంది. బుధవారం ఎస్పీ రాధాకృష్ణన్‌ ఈ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సుమారు లక్షన్నర మంది విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఇందులో లక్ష మంది మేరకు పోలీసులు ఉన్నారు. వీరికి సెలవులు దొరకడం అరుదే. ఈ కరోనా కాలంలో అయితే, రేయింబవళ్లు శ్రమించక తప్పడం లేదు. సెలవుల కరువు, పనిభారం వెరసి అనేక మంది పోలీసులు మానసిక వేదనకు గురవుతున్నట్టుగతంలో వెలుగు చూసింది. ఇందుకు తగ్గట్టుగానే పలువురు బలన్మరణాలకు సైతం పాల్పడ్డారు. దీంతో పోలీసుల్లో మానసిక వేదనను తగ్గించే రీతిలో అప్పుడుప్పుడు ప్రత్యేకంగా యోగా క్లాస్‌లను సైతం నిర్వహించాల్సిన పరిస్థితి.

ఈ పరిస్థితుల్లో విల్లుపురం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్, కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇక, జిల్లా పరిధిలో ఉన్న పై స్థాయి  అధికారి మొదలు, కింది స్థాయి పోలీసు వరకు వారి పెళ్లిరోజున సెలవు తీసుకునే అవకాశం కల్పించారు. జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అందరూ తమ మ్యారెజ్‌ డే రోజు వివరాలను జిల్లా కేంద్రానికి సమర్పించాలని ఎస్పీ రాధాకృష్ణన్‌ ఆదేశించారు. ఆయా సిబ్బంది మ్యారేజ్‌ డే రోజున శుభాకాంక్షలతో కూడిన కార్డును పంపించడమే కాదు, ఆ రోజు సెలవు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ  బుధవారం ఐదు మంది సిబ్బందికి శుభాకాంక్షలతో కూడిన కార్డు, సెలవు మంజూరు చేశారు. కుటుంబాలతో గడిపేందుకు పోలీసులకు సమయం అన్నది అరుదేనని, అందుకే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని, ఈ ఒక్క రోజైనా కుటుంబీకులతో ప్రతి పోలీసు ఆనందంగా గడపాలని కాంక్షిస్తున్నట్టు జిల్లా ఎస్పీ పేర్కొనడం విశేషం.

మరిన్ని వార్తలు